అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa | హైదరాబాద్ నగరంలోని గోషామహల్ నియోజకవర్గం కుల్సుంపురాలో కబ్జాలను హైడ్రా అధికారులు శుక్రవారం తొలగించారు.
1.30 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫ్‌నగర్ మండలం పరిధిలోని కుల్సుంపూర్ (Kulsumpur) సర్వే నంబరు 50లో 1.30 ఎకరాల భూమిని అశోక్ సింగ్ అనే వ్యక్తి ఆక్రమించారు. ఆ స్థలంలో షెడ్లు వేసి విగ్రహాల తయారీ కోసం అద్దెకు ఇస్తున్నారు. ఈ భూమిని ప్రజావసరాల కోసం వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ స్థలంలో పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో హైడ్రా అధికారులు ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన షెడ్లను శుక్రవారం ఉదయం తొలగించారు. రూ. 110 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడారు.
Hydraa | కలెక్టర్ ఫిర్యాదుతో..
కుల్సుంపురాలో ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ హైదరాబాద్ కలెక్టర్ (Hyderabad Collector) హైడ్రాను కోరారు. దీంతో పాటు స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా అధికారులు (Hydraa Officers) ప్రభుత్వ భూమిగా నిర్ధారించుకున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydraa Commissioner Ranganath) ఆదేశాల మేరకు ఆక్రమణలను తొలగించారు. కాగా ఈ భూమి తనదంటూ అశోక్ సింగ్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించాడు. అయితే అక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. కాగా.. గతంలో రెండు సార్లు రెవెన్యూ అధికారులు ఆక్రమణలు తొలగించినట్లు హైడ్రా తెలిపింది. అయితే అశోక్ సింగ్ అధికారులపై దాడికి పాల్పడ్డాడు. తాజాగా హైడ్రా (Hydraa) ఆ ఆక్రమణలను తొలగించి భూమిని స్వాధీనం చేసుకుంది.