అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa | అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి చేపట్టిన భవనాలను కూల్చి వేస్తోంది. పార్క్‌లు, ఇతర స్థలాలను కబ్జా చెరల నుంచి విడిపిస్తోంది.
సంగారెడ్డి జిల్లా (Sangareddy District) అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో శనివారం ఉదయం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. పీజేఆర్ కాలనీ, మియాపూర్ సరిహద్దు ప్రాంతంలో ఐదంతస్తుల అపార్ట్‌మెంట్‌ను హైడ్రా అధికారులు (Hydraa Officers) కూల్చివేశారు. అమీన్‌పూర్ సర్వే నంబర్ 337, 338లలో హుడా అప్రూవ్డ్ లే అవుట్ లో 400 గజాల ప్లాట్ కొని.. పక్కనే మియాపూర్ సర్వే నంబర్ 101లోని దాదాపు 473 గజాలు ఆక్రమించి భాను కన్స్ట్రక్షన్ యజమానులు 5 అంతస్తుల భవనం నిర్మించారు. దీనిపై స్థానికులు ప్రజావాణి (Prajavani)లో ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు ఆక్రమణలు నిజమని తేల్చారు. దీంతో శనివారం ఉదయం ఆ భవనాన్ని కూల్చి వేశారు. కూల్చివేతల సందర్భంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు.
Hydraa | ఆక్రమణదారుల్లో ఆందోళన
హైడ్రా అధికారులు ఇటీవల దూకుడు పెంచారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై వెంటనే విచారణ చేపడుతున్నారు. ఆక్రమణలు నిజమని తేలితే ఆ భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు సైతం పరిష్కారం అవుతున్నాయి. హైడ్రా అధికారులు వేగంగా స్పందిస్తుండటంతో ప్రజలు సైతం ఫిర్యాదులు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా లే అవుట్లలో పార్క్‌లు, ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలాలను కొందరు కబ్జా చేశారు. ఇలాంటి వాటిపై ఇటీవల ఎక్కువగా ఫిర్యాదులు వస్తుండగా.. హైడ్రా ఆక్రమణలు తొలగిస్తోంది. హైడ్రా చర్యలతో ఆక్రమణలకు పాల్పడిన వారు ఆందోళన చెందుతున్నారు.
