అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hydraa | నగరంలో ఓ వైపు చెరువుల పునరుద్ధరణ పనులు చేపడుతున్న హైడ్రా (HYDRAA).. మరోవైపు ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా వెయ్యి గజాల పార్కు స్థలాన్ని కాపాడింది.
హైదరాబాద్ నగరంలో (Hyderabad city) చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల రక్షణ కోసం ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. ఈ మేరకు చర్యలు చేపడుతున్న హైడ్రా.. ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలాలను సైతం కబ్జా చెరల నుంచి విడిపిస్తోంది. పార్కులు, రోడ్ల ఆక్రమణలను తొలగిస్తోంది. రంగారెడ్డి జిల్లా (Ranga Reddy district) శేరిలింగంపల్లి మండలం, మదీనాగూడ గ్రామంలో ఉన్న 1,000 చదరపు గజాల పార్కును హైడ్రా రక్షించింది. దీని విలువ సుమారు రూ.13 కోట్లు ఉంటుందని అంచనా.
Hydraa | ప్రజావాణిలో ఫిర్యాదు..
ఈ భూమి ఉషోదయ ఎన్‌క్లేవ్‌లోని సర్వే నంబర్ 23 కిందకు వస్తుంది. ఇది హుడా ఆమోదించిన లేఅవుట్. 1,000 చదరపు గజాలు అధికారికంగా పబ్లిక్ పార్కు కోసం కేటాయించారు. గిఫ్ట్ డీడ్ ద్వారా GHMCకి బహుమతిగా ఇచ్చారు. ఒక స్థానిక వ్యక్తి పార్క్ స్థలాన్ని ఆక్రమించి, ప్రీకాస్ట్ వాల్ నిర్మించారు. దానిని వ్యక్తిగత నియంత్రణలో ఉంచుకున్నాడు. ఈ భూమిని పార్కు స్థలంగా పేర్కొంటూ స్పష్టమైన రికార్డులు ఉన్నప్పటికీ స్థానిక అధికారులు దానిని రక్షించడంలో విఫలమయ్యారు.
ఉషోదయ ఎన్క్లేవ్ (Ushodaya Enclave) వాసులు ప్రజావాణిలో హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో హైడ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఆ భూమిని పబ్లిక్ పార్కుగా నిర్ధారించి, సోమవారం ఆక్రమణ గోడను కూల్చివేసింది. అనంతరం ఆ స్థలం చుట్టూ కంచె వేశారు.