అక్షరటుడే, వెబ్డెస్క్ : Hydraa action | హైదరాబాద్ (Hyderabad) నగరం పరిధిలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా రూ.2,200 కోట్ల విలువైన స్థలాన్ని అధికారులు కాపాడారు.
మాదాపూర్ (Madhapur)లోని హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్ (Hi-Tech Exhibition Center) సమీపంలో గురువారం హైడ్రా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఆక్రమణకు గురైన 11 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. దాని విలువ రూ.2,200 కోట్లు అని అధికారులు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని ఖానామెట్ గ్రామంలో పెద్ద ఎత్తున కూల్చివేతలు చేపట్టింది. మొండికుంట చెరువు, చుట్టుపక్కల అక్రమంగా నిర్మించిన వందలాది తాత్కాలిక షెడ్లు, 30కి పైగా వాణిజ్య దుకాణాలను అధికారులు తొలగించారు.
Hydraa action | ప్రజావాణిలో ఫిర్యాదు
మొండికుంట చెరువులో ఆక్రమణల గురించి స్థానికులు హైడ్రా ప్రజావాణి (Hydraa Prajavani)లో ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశలించారు. సర్వే నంబర్ 53, 55లలో ఆక్రమణలు జరిగినట్లు గుర్తించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు గురువారం కూల్చివేతలు చేపట్టారు. ఆ స్థలంలో అనేక దుకాణాలు, మెకానిక్ షెడ్లు, వాణిజ్య నిర్మాణాలు నిర్మించారు. అక్రమార్కులు నెలకు రూ.లక్షల అద్దె ఆర్జిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కూల్చివేతలకు ముందు ఆక్రమణదారులకు అధికారులు నోటీసులు అందించారు. భారీ భద్రతా మధ్య కూల్చివేతలను చేపట్టారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. వందలాది తాత్కాలిక షెడ్లు, అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. అక్రమ నిర్మాణాలను తొలగించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు.