అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hydraa | ప్రగతినగర్ (అంబీర్) చెరువుకు (Pragathi Nagar (Ambeer) lake) హైడ్రా పునరుజ్జీవం తీసుకు వచ్చింది. చెరువులో వ్యర్థాలను హైడ్రా సిబ్బంది తొలగించారు.
కూకట్పల్లి (Kukatpally) ప్రగతి నగర్‌లోని అంబీర్ చెరువు ఒకప్పుడు ఆహ్లాదాన్ని పంచేది. అయితే నగరీకరణలో పరిసరాలన్నీ కాంక్రీట్ జంగిల్‌గా మారిపోగా.. వ్యర్థాలకు నిలయంగా మారింది. చికెన్, మాంసం, చేపల వ్యర్థాలతో దుర్గంధభరితమైంది. దీంతో స్థానికులు హైడ్రాలో ఫిర్యాదు చేశారు. ఫర్ ఎ బెటర్ సొసైటీ ప్రతినిధులు హైడ్రా కమిషనర్‌ను (Hydra Commissioner) కలిసి చెరువుకు పునరుజ్జీవం తీసుకు రావాలని కోరారు. దీంతో హైడ్రా సిబ్బంది అక్కడ చెత్త వేయకుండా చర్యలు చేపట్టారు. చెరువులో చికెన్ వ్యర్థాలు వేయడానికి వచ్చిన 4 వాహనాలను హైడ్రా పట్టుకుంది.
Hydraa | 104 లారీల చెత్త తొలగింపు
హైడ్రా సిబ్బంది చెరువులో చెత్త తొలగింపు పనులు చేపట్టారు. స5 నుంచి 6 లారీలు, 3 జేసీబీలతో చెత్తను తొలగిస్తోంది. శనివారం వరకూ 104 లారీల చెత్తను హైడ్రా తరలించింది. చెరువు ఒడ్డున గుట్టలుగా చెత్త పేరుకుపోయిందని, మరో వంద లారీలకు పైగా ఉంటుందని అక్కడ పనులు చేపట్టిన అధికారులు చెబుతున్నారు. ఇక్కడ చిరు వ్యాపారులతో మాట్లాడి ప్రత్యామ్నాయ స్థలంలో అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. చెత్తను పూర్తిగా తొలగించి, ఫెన్సింగ్ వేస్తామని అధికారులు తెలిపారు.