అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hydraa | ప్రభుత్వ భూములను హైడ్రా (Hydraa) రక్షిస్తోంది. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతుంది. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములను కబ్జా చెరల నుంచి విడిపిస్తోంది. తాజాగా రూ.1300 కోట్లు విలువ చేసే హైడ్రా సిబ్బంది కాపాడారు.
మేడ్చల్ జిల్లా (Medchal district) బాచుపల్లి మండలం నిజాంపేటలో 13 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా శుక్రవారం కాపాడింది. ఈ భూమి విలువ దాదాపు రూ. 1300 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. సర్వే నంబరు 186, 191తో పాటు 334లలో ప్రభుత్వ భూమి కబ్జా అవుతోందని.. కాపాడాలని బాచుపల్లి మండల రెవెన్యూ అధికారులు (Bachupally mandal revenue officials) హైడ్రాను కోరారు. ఇప్పటికే కొంత భూమి ఆక్రమణలకు గురి అయ్యిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Hydraa | షెడ్ల తొలగింపు
హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే నంబరు 334లో ఇప్పటికే 4 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాలు జరిగి శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకున్నట్లు నిర్ధారించారు. నివాసాల జోలికి వెళ్లకుండా అక్కడ మిగిలి ఉన్న 13 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడారు. అందులో వేసిన తాత్కాలిక షెడ్డులను హైడ్రా తొలగించింది. ఆ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది.
Hydraa | పాత బస్తీలో..
పాత బస్తీలో హైడ్రా ఏడు ఎకరాల భూమిని కాపాడింది. బండ్లగూడ మండలం కందికల్ విలేజ్‌లోని మొహమ్మద్‌నగర్ – లాలితాబాగ్ ప్రాంతం, రైల్వే ట్రాక్ సమీపంలో టౌన్ సర్వే నంబర్ 28, బ్లాక్ ఎఫ్, వార్డు నంబర్ 274లో మొత్తం 9.11 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇప్పటికే 2 ఎకరాలు కబ్జా అయి.. నివాసాలు వచ్చేశాయి. ఆ నివాసాల జోలికి వెళ్లకుండా కబ్జాలో ఉన్న 7 ఎకరాల భూమిని హైడ్రా కాపాడింది. అక్కడ ఉన్న చెరువును కబ్జా చేసి షెడ్లు నిర్మించారు. ఇప్పటికే దానిపై పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్న కబ్జాదారులు తమ భూమి అంటూ కోర్టులో కేసు వేశారు. అయితే కోర్టు ప్రభుత్వ భూమి అని స్పష్టం చేసింది. ఈ క్రమంలో శుక్రవారం హైడ్రా అధికారులు 7 ఎకరాల భూమిని కాపాడారు. దాని విలువ దాదాపు రూ. 400 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.