అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hydraa | హైదరాబాద్ నగరంలో (Hyderabad city) ఆక్రమణలు పెరిగిపోయాయి. ఖాళీ స్థలం కనిపిస్తే కొందరు కబ్జా చేస్తున్నారు.
మహా నగరంలో భూముల రేట్లు ఆకాశాన్ని అంటాయి. దీంతో కొందరు బడాబాబులు ప్రభుత్వ భూములపై (government lands) కన్నేశారు. అనేక చెరువులను ఇప్పటికే మాయం చేశారు. దీంతో ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. నగరంలోని అనేక ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలను హైడ్రా (Hydraa) కబ్జా చెరల నుంచి విడిపిస్తోంది. దీంతో అక్రమార్కులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా హైడ్రా అధికారులు రోడ్డుపై చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించారు.
Hydraa | రోడ్డుపై గదులు
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా (Medchal-Malkajgiri district) అల్వాల్ మండలం ఆర్వింద్ ఎన్‌క్లేవ్‌లో రోడ్డు నంబరు 4ను ఆక్రమించి అదే మార్గంలోని ఇంటి యజమానులు నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయమై జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా పరిష్కారం లభించలేదు. 15 ఏళ్లుగా స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. 50 అడుగుల రహదారిలో ఆటంకాలు తొలగితే.. కేవలం 100 మీట్లర్లలో ప్రధాన రహదారికి చేరుకుంటామని.. ఇప్పుడు కిలోమీటరుకు పైగా తిరిగి వెళ్లాల్సి వస్తుందని కాలనీ వాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
క్షేత్ర స్థాయిలో హైడ్రా అధికారులు (HYDRAA officials) పరిశీలించారు. ఆక్రమణలు నిజమేనని తేలడంతో తొలగించారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఆక్రమణలు తొలగడంతో హర్ష హాస్పిటల్ లేన్‌కు సులభంగా చేరుకొవచ్చన్నారు. అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు రాకపోకలకు ఇబ్బందులు తొలగిందన్నారు.