అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa | హైదరాబాద్ (hyderabad) నగరంలో ఆక్రమణలపై ఫిర్యాదు చేయడానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydraa Commissioner Ranganath) ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రజలు తమ ప్రాంతాల్లో ఆక్రమణలపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ ఫిర్యాదులను విచారించిన అధికారులు నిర్మాణాలు అక్రమం అని తేలితే కూల్చి వేస్తున్నారు. ఇటీవల ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై కమిషనర్ రంగనాథ్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Hydraa | లే అవుట్ కబ్జా అయిందని ఫిర్యాదు
తమ లే అవుట్ మొత్తం కబ్జా అయిందని శేరిలింగంపల్లి (Serilingampally) మండలం గోపన్నపల్లి గ్రామంలో ప్లాట్లు కొన్న పలువురు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. గోపన్నపల్లి (Gopannapally)లోని రంగనాథ్ నగర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. 1985లో 184 ఎకరాల పరిధిలో 850కి పైగా ప్లాట్లతో లేఔట్ వేయగా తామంతా కొన్నామని చెప్పారు. 2021లో రియల్ ఎస్టేట్ సంస్థల యజమానులు సమూహంగా ఏర్పడి తమ లే అవుట్ మొత్తాన్ని కబ్జా చేశారంటూ కమిషనర్ ముందు వాపోయారు.
Hydraa | హైకోర్టు చెప్పినా..
ఈ లే అవుట్లో కట్టుకున్న ఇళ్లను కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదంపై తాము కోర్టులను ఆశ్రయించామని.. 4 వారాల్లో తమకు న్యాయం చేయాలని హైకోర్టు తీర్పు చెప్పిందన్నారు. ఈ తీర్పు ప్రకారం ఆక్రమణలను తొలగించాలని (ghmc) డిప్యూటీ కమిషనర్ నోడల్ అధికారికి ఆదేశాలిచ్చినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ప్లాట్ కోసం వెళ్తే తమపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని కోణాల్లో పరిశీలించి న్యాయం చేస్తామని బాధితులకు కమిషనర్ హామీ ఇచ్చారు.
అంతకు ముందు మేడ్చల్ (medchal) జిల్లా చెంగిచెర్ల, బోడుప్పల్ ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించారు. దేవాదాయ శాఖ ట్రస్ట్ భూములను ఆక్రమించి ఆ పక్కనే ఉన్న తమ లే అవుట్‌ను కబ్జా చేయడానికి మాజీ ఎమ్మెల్యే (former mla) ప్రయతిస్తున్నారని శ్రీమాత అరవింద కాలనీ వాసులు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అదే ప్రాంతంలో బోడుప్పల్ గ్రామంలోని వికాస్ వెల్ఫేర్ కాలనీలో 70 ప్లాట్లు ఉండగా అందులో 35 ప్లాట్లు కలిగిన రాజకీయ నాయకుడు, గత ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి తమ ప్లాట్లు కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఫిర్యాదు చేశారు.
గోపన్నపల్లిలో హౌసింగ్ బోర్డుకు కేటాయించిన దాదాపు 60 ఎకరాల భూమిలో ఫెన్సింగ్ వేయనియ్యడం లేదని స్థానిక అధికారులు ఫిర్యాదు చేయగా కమిషనర్ పరిశీలించారు. షేక్‌పేటలోని ఓయూ కాలనీలో రోడ్ల ఆక్రమణలపై ఫిర్యాదు రాగా కమిషనర్పరిశీలించారు. ప్లాట్ ఓనర్లతో చర్చించి .. సంబంధిత పత్రాలను అందజేయాలని ఆదేశించారు.