అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa | హైదరాబాద్ నగరంలో హైడ్రా మరోసారి దూకుడు కొనసాగించింది. బంజారాహిల్స్‌లో అక్రమంగా ఆక్రమించుకున్న ఐదెకరాల విలువైన స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ ఆస్తులు, చెరువులను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్న హైడ్రా (Hydraa).. ప్రభుత్వ స్థలంలో కూల్చివేతలు చేపట్టింది.
బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి (Cancer Hospital) సమీపంలో ఐదెకరాల్లో వెలిసిన ఆక్రమణలను తొలగించింది. స్థానికుల ఫిర్యాదు మేరకు శుక్రవారం ఉదయం రంగంలోకి దిగిన హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సుమారు రూ.750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను తొలగించింది.
Hydraa | బౌన్సర్లతో భద్రత
బంజారాహిల్స్(Banjara Hills)లోని ఐదెకరాల ప్రభుత్వ భూమిలో గత ప్రభుత్వం 1.20 ఎకరాలను జల మండలికి కేటాయించింది. అయితే, 1.20 ఎకరాలతో సహా మొత్తం ఐదెకరాలు తనదేనని పార్థసారథి అని వ్యక్తి కోర్టుకెళ్లాడు. తప్పుడు పత్రాలు, సర్వే నెంబర్లు సృష్టించి ఆక్రమణలకు పాల్పడ్డారు. చుట్టూ ప్రహరీ నిర్మించి బౌన్సర్లు, వేటకుక్కలతో కాపలా పెట్టాడు. వివాదం కోర్టులో ఉన్నప్పటికీ స్థలాన్ని స్వాధీనం చేసుకుని అందులో నిర్మాణాలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూమిని చెరబట్టడమే కాకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని జలమండలి, రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
Hydraa | తప్పుడు పత్రాలతో..
వాస్తవానికి తనకు కేటాయించిన 1.2 ఎకరాల్లో జలమండలి వాటర్ రిజర్వాయర్ నిర్మించాలని తలచింది. అయితే పార్థసారథి తప్పుడు పత్రాలతో ఆ స్థలం తనదంటూ కొట్టేసే ప్రయత్నం చేశాడు. వాస్తవానికి సర్వే నెంబర్ 403 ప్రభుత్వ భూమి కాగా, సర్వే నెం.405/52తో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి స్థలాన్ని కబ్జా చేశాడు. ఈ నేపథ్యంలో అతనిపై నాలుగు కేసులు కూడా నమోదయ్యాయి.
Hydraa | రంగంలోకి దిగిన హైడ్రా..
ఐదెకరాల స్థలం ఆక్రమణపై హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో శుక్రవారం తెల్లవారుజామున రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది(Hydraa Staff) బుల్డోజర్లతో కూల్చివేతలు చేపట్టారు. భారీ పోలీసు భద్రతతో స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఐదు ఎకరాల చుట్టూ కూడా ఫెంక్షన్‌ను ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేసింది.