అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad WhatsApp Drug Racket | హైదరాబాద్ (Hyderabad) నగరంలో డ్రగ్స్ దందా జోరుగా సాగుతోంది. పోలీసులు దాడులు చేస్తున్నా.. డ్రగ్స్ విక్రయాలు ఆగడం లేదు. తాజాగా కొండాపూర్ (Kondapur)లో అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
నగరంలోని ఐటీ కారిడార్ (IT Corridor)లో డెడ్ డ్రాప్ పద్ధతిలో ఓ ముఠా డ్రగ్స్ దందా చేస్తుంది. వాట్సాప్ ద్వారా ఆర్డర్లు స్వీకరించి.. ఆన్లైన్లో డబ్బులు తీసుకుంటున్న ఆ ముఠా సభ్యులు.. ఒక ప్రాంతంలో డ్రగ్స పెడతారు. అనంతరం ఆ లోకేషన్‌ను కస్టమర్లకు పంపిస్తారు. పోలీసులకు చిక్కకుండా నిందితులు ఇలా దందా చేస్తున్నారు. అయితే పోలీసులు సోమవారం సాయంత్రం దాడులు చేసి డ్రగ్ పెడ్లర్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
Hyderabad WhatsApp Drug Racket | డ్రగ్స్‌కు బానిసై..
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా (Godavari District)కు చెందిన మురళి కృష్ణంరాజు బీటెక్ మధ్యలోనే ఆపేశాడు. అనంతరం డ్రగ్స్‌కు బానిసయ్యాడు. ఆ తర్వాత మెల్లిగా డ్రగ్స్ దందాలోకి దిగాడు. మొదట మణికొండలో ఓ వ్యక్తి నుంచి కొకైన్ కొనుగోలు చేసి విక్రయించేవాడు. అతడు అరెస్ట్ కావడంతో నేరుగా గోవా, బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నాడు. పోలీసులకు చిక్కకుండా మొత్తం ఆన్లైన్లోనే దందా చేస్తున్నాడు. అయితే పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి అతడిని అరెస్ట్ చేశారు. కృష్ణంరాజుతో పాటు అతడికి సహకరిస్తున్న చిరంజీవి వర్మ, రుద్రరాజు హేమంత్రాజులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.40 లక్షల విలువైన 32 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad WhatsApp Drug Racket | ప్రైవేట్ బస్సుల ద్వారా..
కృష్ణంరాజు బెంగళూరు నుంచి ట్రావెల్స్ బస్సుల ద్వారా డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చేవాడు. అనంతరం ఓ ర్యాపిడో డ్రైవర్ (Rapido Driver) సాయంతో కస్టమర్లకు డెలివరీ చేసేవాడు. కొండాపూర్‌లోని వెంకటరమణ రెసిడెన్సీలో ఈగల్ టీం, గచ్చిబౌలి పోలీసులు దాడులు చేసి, అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడు 15 మంది ప్రముఖ కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతడికి సహకరించి ట్రావెల్స్ బస్ డ్రైవర్, ర్యాపిడో డ్రైవర్‌పై కూడా కేసు నమోదు చేశారు.