అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Vijayawada NH65 Expansion | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) జాతీయ రహదారి ప్రాజెక్టుల అమలులో వేగం పెంచింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఉన్న జాతీయ రహదారి 65ను ఆరు లైన్లుగా విస్తరించే పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
ఈ విస్తరణలో భాగంగా విజయవాడ సమీప ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా తగ్గించేందుకు ఐదు ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని ప్రతిపాదిస్తున్నట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (National Highways Authority of India) అధికారులు వెల్లడించారు. ప్రజా ప్రతినిధుల నుంచి కూడా అనేక ప్రతిపాదనలు రావడంతో అవసరానికి అనుగుణంగా ఫ్లైఓవర్లను ప్లాన్ చేస్తున్నారు. స్టేక్హోల్డర్ల సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తుది ఆమోదం కోసం పంపనున్నారు.
Hyderabad Vijayawada NH65 Expansion | త్వరలోనే క్లారిటీ..
ప్రతిపాదిత ఫ్లైఓవర్లలో గొల్లపూడి బైపాస్ నుంచి కనకదుర్గ ఫ్లైఓవర్ వరకు సుమారు 2.5 కిలోమీటర్లు, కనకదుర్గ ఫ్లైఓవర్ ల్యాండింగ్ నుంచి పీఎన్బీఎస్ మీదుగా స్క్రూ బ్రిడ్జి వరకు 5 కిలోమీటర్లు, ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద 1.3 కిలోమీటర్లు, బెంజిసర్కిల్ నుంచి కానూరు వరకు సుమారు 9 కిలోమీటర్లు, నిడుమోలు వద్ద 700 మీటర్ల ఫ్లైఓవర్లు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. హైవే విస్తరణకు సంబంధించి విజయవాడ సమీపంలో రెండు వేర్వేరు డీపీఆర్‌లు రూపొందించాలనే ఆలోచన ఉన్నప్పటికీ, అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఫ్లైఓవర్ల అవసరంపై స్పష్టత లేకపోవడంతో ప్రక్రియ కొంతకాలం నిలిచిపోయింది. అయితే ప్రజా ప్రతినిధులు అవసరమైన ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు నిర్మించాలని పదేపదే కోరడంతో NHAI అధికారులు సానుకూలంగా స్పందించి తాజా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ఫ్లైఓవర్లు అమలులోకి వస్తే ట్రాఫిక్ రద్దీ (Traffic Jam) తగ్గడమే కాకుండా రోడ్డు ప్రమాదాలు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఈ క్రమంలో విజయవాడ బెంజిసర్కిల్ (Vijayawada Benzi Circle) నుంచి మచిలీపట్నం వరకు, అలాగే హైదరాబాద్ నుంచి గొల్లపూడి బైపాస్ వరకు విస్తరణ చేయాలని ఎంపీలు కేశినేని చిన్ని, వల్లభనేని బాలశౌరి ప్రతిపాదనలు చేశారు. ముఖ్యంగా బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ స్క్రూ బ్రిడ్జి నుంచి కనకదుర్గ ఫ్లైఓవర్ వరకు నాలుగు లైన్ల విస్తరణ లేకపోవడం వల్ల ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మిస్తే మొత్తం జాతీయ రహదారి 65 (National Highway 65) ఆరు లైన్ల విస్తరణ పూర్తవుతుందని, ప్రమాదాలకు చెక్ పడుతుందని వారు సూచించారు. దీంతో హైదరాబాద్–విజయవాడ నేషనల్ హైవేను మచిలీపట్నం వరకు ఒకే డీపీఆర్‌తో DPR విస్తరించాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. మొత్తంగా జాతీయ రహదారి 65 విస్తరణ పనులు మరింత వేగవంతం అవుతూ, భవిష్యత్తులో ట్రాఫిక్ ఫ్రీ ప్రయాణానికి దోహదపడే దిశగా ముందుకు సాగుతున్నాయి.