అక్షరటుడే, వెబ్‌డెస్క్ : SI bribery case | లంచం తీసుకుంటూ ఓ ఎస్సై ఏసీబీ (ACB) అధికారులకు చిక్కాడు. ఈ ఘటన హైదరాబాద్ (Hyderabad) నగరంలోని మాదాపూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది.
అవినీతి అధికారులు మారడం లేదు. నిత్యం ఏసీబీ దాడులు చేపడుతున్నా భయపడటం లేదు. ప్రతి పనికి ఓ రేటు కడుతున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. తాజాగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ (Madhapur Police Station)లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఎస్సై వినయ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ వ్యక్తి చీటింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అతడిని జైలు నుంచి తప్పించేందుకు ఎస్సై లంచం డిమాండ్ చేశాడు. ఈ మేరకు మంగళవారం లంచం తీసుకుంటుండగా.. అతడిని ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. అనంతరం ఠాణాలో సోదాలు చేశారు. కేసు నమోదు చేసి ఎస్సైని అరెస్ట్ చేశారు.
SI bribery case | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు.ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.
ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.