అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Police | హైదరాబాద్ (Hyderabad) నగరంలో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై ఓ వ్యక్తిని కొంతమంది దుండగులు హత్య చేశారు.
నగరంలోని భరత్ నగర్ (Bharath Nagar) బ్రిడ్జి పక్కన శంకర్(48) అనే వ్యక్తిని కత్తులతో పొడిచి దుండగులు చంపారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. శంకర్ కర్ణాటక (Karnataka) నుంచి బతుకు దెరువు కోసం నగరానికి వచ్చినట్లు గుర్తించారు. అతడు మూసాపేటలోని ఓ హోటల్లో రెండేళ్లుగా పని చేస్తున్నాడు. అయితే ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Hyderabad Police | పెరుగుతున్న హత్యలు
కాగా నగరంలో ఇటీవల హత్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా నడిరోడ్డుపై ప్రాణాలు తీయడానికి సైతం కొందరు వెనుకాడం లేదు. చాలా వరకు హత్యలకు ఆస్తి తగదాలు, వివాహేతర సంబంధాలు కారణం అవుతున్నాయి. గతంలో నగరంలోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. షాహీన్ నగర్‌లో అమెర్ (32) అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ (Jawaharnagar Police Station) పరిధిలోని సాకేత్ కాలనీలో ఇటీవల ఓ రియల్టర్‌ను దుండగులు హత్య చేశారు. రియల్టర్ వెంకటరత్నం స్కూటీపై వెళ్తుండగా.. సాకేత్ కాలనీలోని ఫోస్టర్ స్కూల్సమీపంలోకి రాగానే అతడిపై దాడి చేశారు. నడిరోడ్డుపై షూట్ చేశారు. అనంతరం కత్తులతో పొడిచి హత్య చేశారు. పాతబస్తీలోని రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ (Rain Bazaar Police Station) పరిధిలో సైతం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్యకు గురయ్యాడు.
