అక్షరటుడే, వెబ్డెస్క్ : Speed Post | హైదరాబాద్ (Hyderabad) జనరల్ పోస్టాఫీస్ (GPO) కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి 24×7 నైట్ షిఫ్ట్ బుకింగ్ సేవలను ప్రారంభించింది.
పోస్టాఫీసుల్లో ప్రస్తుతం పగటిపూట మాత్రమే కార్యకలాపాలు సాగుతున్నాయి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా పోస్టల్ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. హైదరాబాద్ నగరంలో రాత్రి పూట కూడా చాలా మంది వర్క్ చేస్తారు. దీంతో వారి కోసం నైట్ షిఫ్ట్ సేవలను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. ఇక నుంచి వినియోగదారులు ఏ సమయంలోనైనా స్పీడ్ పోస్ట్ డాక్యుమెంట్లను బుక్ చేసుకోవడానికి, పంపడానికి అవకాశం ఉంది. పగటిపూట కౌంటర్లతో పాటు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు కార్యకలాపాలు నడుస్తాయి.
Speed Post | నిరంతర సేవల కోసం..
ప్రజలకు అంతరాయం లేని యాక్సెస్, ఎక్కువ సౌకర్యాన్ని అందించడం కోసం హైదరాబాద్ జీపీవో ఈ నిర్ణయం తీసుకుంది. నైట్ షిఫ్ట్ సౌకర్యం 15 అక్టోబర్ నుంచి అమలులోకి వచ్చింది. ఈ సేవ ప్రత్యేకంగా స్పీడ్ పోస్ట్ డాక్యుమెంట్ (లెటర్) బుకింగ్, పంపడానికి వర్తిస్తుంది. సాయంత్రం, రాత్రిపూట సేవలు అవసరమయ్యే కస్టమర్లు ఇప్పుడు పగటిపూట వరకు వేచి ఉండకుండా బుకింగ్‌లను పూర్తి చేసుకోవచ్చు. స్థిరమైన స్పీడ్ పోస్ట్ కదలికకు మద్దతు ఇవ్వడానికి హైదరాబాద్ GPO రాత్రిపూట బుకింగ్ కౌంటర్లను పనిలో ఉంచుతుందని అధికారులు తెలిపారు. ప్రజలు పొడిగించిన సమయాలను సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్ అధికారులు కోరారు.