అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Park Encroachments | హైదరాబాద్‌లో అనేక పార్కు స్థలాలు కబ్జాలకు గురి అయ్యాయి. లే అవుట్ వేసిన సమయంలో పార్కుల కోసం కేటాయించిన స్థలాలను అనంతరం కొందరు ఆక్రమించి ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారు. వీటిపై హైడ్రా (Hydraa)కు భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి.
హైడ్రా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 59 ఫిర్యాదులు వచ్చాయి. రంగారెడ్డి (Rangareddy) జిల్లా హయత్‌నగర్ మండలం సాహేబ్‌కళాన్‌లో సర్వే నంబరు 225లో 16.35 ఎకరాల మేర మెడికల్ అండ్ హెల్త్ కాలనీ లేఔట్‌ను 216 ప్లాట్లతో వేశారు. ఇందులో 305 గజాల స్థలంలో ఓపెన్ బావి ఉంది. దీనిని ఆక్రమించారని స్థానికులు ఫిర్యాదు చేశారు.
Hyderabad Park Encroachments | పార్కు చుట్టూ ప్రహరీ
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కాప్రా (Kapra) మండలం చర్లపల్లిలోని ఈసీనగర్‌లో ఎకరం స్థలాన్ని పార్కుగా కేటాయించగా.. లే ఔట్ వేసినప్పుడు ఆ భూమిని అమ్మిన వ్యక్తే తనదంటూ ఆక్రమించేశాడు. చుట్టూ ప్రహరీ నిర్మించారని ఈసీనగర్ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. గతంలో మున్సిపాలిటీ వాళ్లు పార్కు ల్యాండ్‌గా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసినా కబ్జాలు ఆగలేదని పేర్కొన్నారు.
కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం (Gajula Ramaram) విలేజ్‌లో మిథిలానగర్, విష్ణుప్రియ ఎన్‌క్లేవ్ హద్దులలో 35 గుంటల పార్కు ఉండగా.. అందులో రకరకాల ఆలయాల పేరిట ఆక్రమణలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ ఉపయోగపడేలా పార్కుగా కొనసాగించాలని కోరారు. మహేశ్వరం నియోజకవర్గం షంషాబాద్ జోన్ పరిధిలోని నాదర్గుల్ గ్రామంలో సున్నం చెరువు, రెడ్డికుంటతో పాటు.. ఇతర చెరువులకు వెళ్లే వరద కాలువ కబ్జాలకు గురి అవుతోందని స్థానికులు వినతి పత్రం అందించారు. దీంతో ప్రతి ఏటా వరద తమ ప్రాంతాలను ముంచెత్తుతోందని గ్రీన్ హిల్స్ కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు.
