Homeక్రైంHyderabad | హైదరాబాద్​లో దారుణం.. గర్భవతిని హత్య చేసిన భర్త.. మృతదేహాన్ని ముక్కలు చేసి..

Hyderabad | హైదరాబాద్​లో దారుణం.. గర్భవతిని హత్య చేసిన భర్త.. మృతదేహాన్ని ముక్కలు చేసి..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | హైద‌రాబాద్ నగర శివారులోని బోడుప్పల్‌ మేడిపల్లిలో (Boduppal Medipalli) మానవత్వం మంట‌క‌లిపే దారుణ ఘటన వెలుగు చూసింది. గర్భవతిగా ఉన్న భార్యను హత్య చేసిన ఓ వ్యక్తి, ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి మూసీ నదిలో విసిరేసిన సంఘటన మేడిపల్లి పోలీస్‌ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.

ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా (Vikarabad district) కామారెడ్డిగూడకు చెందిన స్వాతి (22), మహేందర్ కొంతకాలం క్రితం ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. వివాహానంతరం దంపతులు హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లోని బాలాజీహిల్స్ ప్రాంతంలో నివసిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే, గత కొంత కాలంగా వీరి మధ్య గొడవలు, విభేదాలు తలెత్తుతున్నాయని సమాచారం.

Hyderabad | నరహంతకుడిగా మారిన భర్త

శనివారం మధ్యాహ్నం సమయంలో స్వాతిని (Swathi) హత్య చేసిన మహేందర్‌.. ఆమె తల, చేతులు, కాళ్లను వేరు చేసి మూసీ నదిలో (Musi river) విసిరాడు. మిగిలిన శరీర భాగాన్ని (మొండెం) కవర్‌లో పెట్టి ఇంట్లోనే ఉంచాడు. దానిని ఎక్కడికీ తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో ఇంట్లో భద్రపరిచాడు. హత్య అనంతరం మహేందర్ తన సోదరికి ఫోన్ చేసి “స్వాతి ఆత్మహత్య చేసుకుంది” అని చెప్పాడు. దీని ద్వారా నిజాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు. అయితే ఆమె సోదరి విషయం తెలుసుకొని వెంటనే స్వాతి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. అనుమానం వచ్చిన వారు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందిన వెంటనే మేడిపల్లి పోలీసులు (Medipally Police) సంఘటనా స్థలానికి చేరుకుని మహేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో మృతదేహాన్ని చూసి సైతం అధికారులు షాక్‌కు గురయ్యారు. అతడిని విచారించిన పోలీసులు, హత్య జరిగిన విధానం, మృతదేహాన్ని తక్కువ సమయంలో ఎలా ముక్కలు చేశాడన్న అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. మహేందర్ చేసిన ఈ క్రూరమైన చర్య వెనుక అసలు కారణం ఏమిటన్నది ఇప్పటికీ స్పష్టంగా బయటపడలేదు. కుటుంబ కలహాలా? ఆర్థిక సమస్యలా? లేక మానసిక సమస్యలా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు (Police investigation) కొనసాగిస్తున్నారు. హత్య జరిగిన ఇంటిని సీజ్ చేసిన పోలీసులు, నదిలో విసిరేసిన మిగిలిన శరీర భాగాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ ఘటన గురించి తెలుసుకున్న స్వాతి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. “ఆమె గర్భవతి అని.. మేము మా మనవడు లేదా మనవరాలిని ఎప్పుడెప్పుడు చూస్తామా అని క‌ల‌లు కంటున్నాం. ఇంత పెద్ద ద్రోహం చేస్తాడని కలలో కూడా ఊహించలేదు” అంటూ విలపించారు. వారి రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి.