Homeజిల్లాలుహైదరాబాద్Heavy Rains | కుండపోత వానతో హైదరాబాద్​ అతలాకుతలం.. మరో మూడు రోజులు వర్షాలు పడే...

Heavy Rains | కుండపోత వానతో హైదరాబాద్​ అతలాకుతలం.. మరో మూడు రోజులు వర్షాలు పడే ఛాన్స్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో కుండపోత వాన కురిసింది. గురువారం రాత్రి భారీ వర్షం పడటంతో నగరం చివురటాకులా వణికిపోయింది. సాయంత్రం వరకు పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గంటల వ్యవధిలోనే భారీ వర్షపాతం నమోదు కావడంతో నగరవాసులు అనేక ఇబ్బందులు పడ్డారు.

మహా నగరంలో భారీ వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులు చెరువులను తలపించాయి. దీంతో భారీగా ట్రాఫిక్​ జామ్​ (Traffic Jam) అయి నగరవాసులు నరకయాతన అనుభవించారు. చాలా మార్గాల్లో గంటల తరబడి వాహనదారులు చిక్కుకుపోయారు. ట్రాఫిక్​ పోలీసులు, హైడ్రా, జీహెచ్​ఎంసీ సిబ్బంది రోడ్లను క్లియర్​ చేయడానికి కష్టపడ్డారు.

Heavy Rains | హిమాయత్​ సాగర్​ గేట్లు ఓపెన్​

హైదరాబాద్​ నగరానికి తాగు నీరు అందించే హిమాయత్​ సాగర్ (Himayath Sagar)​ వర్షాలతో నిండుకుండలా మారింది. భారీగా ఇన్​ఫ్లో వస్తుండటంతో అధికారులు ప్రాజెక్ట్​ రెండు గేట్లు ఓపెన్ చేశారు. దీంతో జలాశయం దిగువన గల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు నది సమీపంలోకి వెళ్లొద్దని కోరారు.

Heavy Rains | వర్షపాతం వివరాలు..

నగరంలోని పలు ప్రాంతాల్లో రెండు గంటల వ్యవధిలోనే వంద మిల్లీ మీటర్లను మించి వర్షపాతం నమోదు అయింది. గచ్చిబౌలిలో 133.8 మి.మీ, శ్రీనగర్​ కాలనీ 120.3, సరూర్​ నగర్​ 120.3, ఖైరతాబాద్​ 118.8, యూసుఫ్​గూడ 116.0, ఉప్పల్ 110.5, ఎల్​బీ నగర్​ 105, మైత్రి వనం 103, బంజారాహిల్స్​లో 101.5 మి.మీ వర్షం కురిసింది.

Heavy Rains | నేడు జాగ్రత్త

హైదరాబాద్​ నగరంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం, రాత్రి పూట భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్​ ఉంది. నగర వాసులు సాయంత్రం పూట అత్యవసంర అయితేనే బయటకు రావాలని అధికారులు సూచించారు.