అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mumbai Climate Week | తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (CURE)ను కాలుష్యరహిత గ్రీన్, నెట్ జీరో సేవల కేంద్రంగా అభివృద్ధి చేసి హైదరాబాద్ (Hyderabad) నగరాన్ని దేశానికే ఆదర్శంగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. కార్బన్ ఫుట్‌ప్రింట్ ఆడిట్ చేపట్టనున్న తొలి భారత నగరంగా హైదరాబాద్ నిలవబోతుందని పేరర్కొన్నారు. రాబోయే ఐదేళ్లలో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్)లో కాలుష్య కారక పరిశ్రమలు ఉండవని స్పష్టం చేశారు.
ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో జరిగిన “ముంబై క్లైమెట్ వీక్” సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. నగరాభివృద్ధి, వాతావరణ మార్పులకు అనుగుణమైన విధానాలపై ముఖ్యమంత్రి ప్రసంగించారు. తెలంగాణలో గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నామని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోనూ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రస్తుత అభివృద్ధి వ్యూహంలో తయారీ రంగం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరత్వం కీలకంగా మారాయన్నారు.
Mumbai Climate Week | మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ
తెలంగాణ రైజింగ్ 2047 (Telangana Rising 2047) విజన్ లక్ష్యాలను సీఎం వివరించారు. రాష్ట్ర జీడీపీని 200 బిలియన్ డాలర్ల స్థాయి నుంచి 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా అభివృద్ధి చేస్తామన్నారు. భవిష్యత్ అభివృద్ధికి ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, విద్య, నైపుణ్యాలు, వనరులు, ఉపాధి ప్రధాన స్తంభాలుగా నిలుస్తాయని వెల్లడించారు. అభివృద్ధి కోసం తెలంగాణను CURE, PURE, RARE జోన్లుగా విభజించినట్లు వివరించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE)గా, ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్ (RRR) వరకు ఉన్న ప్రాంతాన్ని పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE) జోన్‌గా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు.
Mumbai Climate Week | తయారీ కేంద్రంగా..
ప్యూర్ ప్రాంతాన్ని దేశంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ తయారీ వృద్ధి గ్రీన్ ఎనర్జీ (Green Energy) ఆధారంగా సాగుతుందని స్పష్టం చేశారు. 2034 నాటికి ఒక రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 34 వేల మెగావాట్లకు చేరుతుందని అంచనా వేశారు. ఇందులో గ్రీన్ ఎనర్జీ వాటా 25 శాతంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు, ముఖ్యంగా డేటా సెంటర్లు, పరిశ్రమలు గ్రీన్ ఎనర్జీని కోరుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ సదస్సు అనంతరం సీఎం ముంబై నుంచి ఢిల్లీకి చేరుకున్నారు.