అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Forensic Lab Fire | హైదరాబాద్ నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ (Nampally Forensic Lab)లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.నాంపల్లిలో రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్ ఉంది. ల్యాబ్‌లోని మొదటి అంతస్తులో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. మంటలు వేగంగా వ్యాపించి పెద్ద ఎత్తున పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పే యత్నం చేస్తున్నారు.
Hyderabad Forensic Lab Fire | కీలక పత్రాలు
రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి నేర విచారణ నిమిత్తం ఫింగర్ ప్రింట్స్, డీఎన్ఏ నమూనాలు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు వస్తుంటాయి. అలాంటి ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. కీలకమైన పత్రాలు, నమూనాలు కాలిపోయినట్లు సమాచారం. మొదటి అంతస్తులోని ఓ విభాగంలో మొదట మంటలు అంటుకొని క్షణాల్లో వ్యాపించాయి. సిబ్బంది అప్రమత్తం అయి బయటకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ (Short Circuit)తో మంటలు చెలరేగిటన్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad Forensic Lab Fire | వరుస ప్రమాదాలు
హైదరాబాద్ (Hyderabad) నగరంలో అగ్ని ప్రమాదాలు పెరిగాయి. ఇటీవల నాంపల్లిలోని బచ్చాస్ ఫర్నిచర్ దుకాణం కాలిపోయి ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. నగరంలో చాలా ప్రాంతాల్లో దుకాణాలు, భవనాల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదు. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రానున్నది వేసవి కాలం కావడంతో అగ్ని ప్రమాదాలు ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలో అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.