అక్షరటుడే, హైదరాబాద్: Tasty Atlas : ఘాటైన అంకాపూర్ చికెన్(Ankapur Chicken), సౌత్ ఇండియన్(South Indian), నార్త్ ఇండియన్(North Indian ) వంటకాలతో పాటు మొఘలాయి(Mughlai), అరబిక్(Arabic), పర్షియన్(Persian), టర్కిష్ (Turkish) రుచులతో ప్రపంచ పర్యాటకులను అలరిస్తోంది మన భాగ్యనగరం.
ముఖ్యంగా హైదరాబాద్ దమ్ బిర్యానీ(Hyderabad Dum Biryani) అంటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ప్రతి ఒక్కరూ లొట్టలేసుకుంటూ ఆరగిస్తారు. ఇక ఇరానీ ఛాయ్ వరల్డ్ ఫేమస్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక హలీమ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంతటి ప్రాచుర్యం పొందిన మన హైదరాబాద్‌కు తాజాగా అరుదైన గుర్తింపు లభించింది.
Tasty Atlas : భాగ్యనగరం స్థానం ఎక్కడంటే..
ప్రపంచంలో టాప్ టేస్టీ ఫుడ్ జాబితాను ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ గైడ్ టేస్టీ అట్లాస్ (international food guide Tasty Atlas) విడుదల చేసింది. ఈ జాబితాలో హైదరాబాద్‌కు చోటు లభించింది. ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన వంటకాలు లభించే టాప్ 100 నగరాల్లో భాగ్యనగరానికి స్థానం కల్పించింది. ఈ జాబితాలో 50వ స్థానంలో మన హైదరాబాద్ నిలిచింది.
Tasty Atlas : ప్రపంచ స్థాయిలో నిలిపిన వంటకాల రుచులు..
తాజాగా లభించిన ఈ గుర్తింపు హైదరాబాద్‌ను.. ఇక్కడి వంటకాల నాణ్యత, వైవిధ్యాన్ని ప్రపంచ స్థాయిలో చాటింది. మరో ముఖ్యమైన స్నాక్స్ ఉస్మానియా బిస్కెట్(Osmania biscuit).. ఈ బిస్కెట్‌ను ఛాయ్‌లో ముంచుకొని నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోద్ది. సమోసా అయితే చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఇష్టపడని వారంటూ ఉండరు. మిర్చీ కా సాలన్ భోజన ప్రియుల మెప్పు పొందిన వంటకం. ఇలా నోరూరించే ఎన్నో వంటకాలతో దేశ, విదేశీ భోజన ప్రియులకు స్వర్గధామంగా విరాజిల్లుతోంది మన భాగ్యనగరం. ఈ ప్రత్యేకతే మన హైదరాబాద్‌ను విశ్వ వేదికపై నిలిపిందనడంలో అతిశయోక్తి కాదు.
Tasty Atlas : ఎక్కడ చూసినా టేస్టీల మయం..
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏ మూలన చూసినా రుచికరమైన వంటకాలు పర్యాటకులను నోరూరిస్తున్నాయి. ముఖ్యంగా నెక్లెస్ రోడ్డు(Necklace Road), జేఎన్టీయూ(JNTUH), ప్రగతినగర్, కేపీహెచ్‌బీKPHB, గండిమైసమ్మ, మియాపూర్, హైటెక్ సిటీ(Hitech City), మాదాపూర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, తీగల వంతెన, ఎల్బీ నగర్, అమీర్‌పేట్, గచ్చిబౌలి, కొండాపూర్, ఉప్పల్, దిల్సుఖ్నగర్, మణికొండ, ముఖ్యంగా చార్మినార్ తదితర ప్రాంతాలు టేస్టీ ఫుడ్ సెంటర్లకు ప్రసిద్ధి గాంచాయి.