అక్షరటుడే, వెబ్‌డెస్క్: GHMC Wards | మున్సిపాలిటీల విలీనం తర్వాత హైదరాబాద్ ఒక మెగా నగరంగా ఆవిర్భవించిందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ (GHMC Commissioner RV Karnan) తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ పరిధి (Greater Hyderabad area) పెంచిన విషయం తెలిసిందే. పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను నగరంలో విలీనం చేసింది. దీనిపై తాజాగా జీహెచ్ఎంసీ కమిషన్ వివరాలు వెల్లడించారు. జీహెచ్ఎంసీ కొత్త మ్యాప్‌ను విడుదల చేశారు. 27 మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (Greater Hyderabad Municipal Corporation) (జీహెచ్ఎంసీ)లో విలీనం చేయడంతో హైదరాబాద్ ఒక మెగా నగరంగా ఆవిర్భవించిందని తెలిపారు.
GHMC Wards | వార్డులు, జోన్ల రెట్టింపు
ఈ విలీనం ఫలితంగా నగరం గణనీయంగా విస్తరించిందన్నారు. జీహెచ్ఎంసీ పరిధి 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2,053 చదరపు కిలోమీటర్లకు పెరిగిందని కమిషనర్ చెప్పారు. విస్తరించిన పరిధి దృష్ట్యా పరిపాలనా సౌలభ్యం కోసం, రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ వార్డుల సంఖ్యను 150 నుంచి 300కి, జోన్ల సంఖ్యను ఆరు నుంచి 12కి పెంచిందన్నారు. అలాగే సర్కిళ్ల సంఖ్యను 30 నుంచి 60కి విస్తరించిందని వివరించారు. ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ వద్ద కొత్త జోన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అదనపు జోనల్, సర్కిల్ కార్యాలయాల ఏర్పాటుతో ప్రజలకు సేవలను వేగంగా, సులభంగా అందించడంతో పాటు, నగరం అంతటా అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని కమిషనర్ అన్నారు.