అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ (Drugs) కలకలం రేపాయి. పంజాగుట్ట (Panjagutta)లోని ఓ కాలేజీకి చెందిన విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయారు.
రాష్ట్రంలో డ్రగ్స్ దందా జోరుగా సాగుతోంది. ఇతర ప్రాంతాల నుంచి గంజాయి, డ్రగ్స్ తీసుకొచ్చి కొందరు విక్రయాలు జరుపుతున్నారు. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ విచ్చలవిడిగా లభ్యం అవుతున్నాయి. ఎస్వీటీ పోలీసులు, ఈగల్ టీమ్ (Eagle Team), హెచ్ న్యూ (H New) పోలీసులు చర్యలు చేపడుతున్నా.. మాదకద్రవ్యాల రవాణా ఆగడం లేదు. తాజాగా పంజాగుట్టలోని ఓ కాలేజీలో డ్రగ్స్ కలకలం రేపాయి. డ్రగ్స్ తీసుకుంటూ ఐదుగురు విద్యార్థులు పట్టుబడ్డారు. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద ఐదుగురిని పట్టుకున్న పోలీసులు వారి నుంచి 10 గ్రాముల ఎండీఎంఏ (MDMA) స్వాధీనం చేసుకున్నారు. వారంతా ఒకే కాలేజీకి చెందిన వారిగా గుర్తించారు.
ఈ డ్రగ్స్ ఎవరు సరఫరా చేస్తున్నారనే అంశంపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన వెనుక ఉన్న ప్రధాన సప్లయర్లు ఎవరు, ఈ నెట్వర్క్ ఎంతవరకు విస్తరించిందన్న దానిపై లోతైన విచారణ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థుల్ని టార్గెట్ చేస్తూ పనిచేస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు.ఇదిలా ఉండగా, డ్రగ్ కల్చర్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సీరియస్ యాక్షన్‌కు సిద్ధమైంది. నిందితులు ఎవరైనా సరే, ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిసలవకుండా ఉండేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలపై ఉక్కుపాదం మోపనున్నట్లు హెచ్చరించింది.
Hyderabad | మత్తుకు చిత్తు
యువత ముఖ్యంగా విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. గంజాయి, డ్రగ్స్ సరదా కోసం తీసుకుంటూ.. దానికి బానిసలుగా మారుతున్నారు. అంతేగాకుండా నగరంలో పలువురు ముఠాలుగా ఏర్పడి గంజాయి తాగుతున్నారు. ఆ మత్తులో రోడ్లపై హంగామా చేస్తున్నారు. విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో చదువుకోవడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు (Students) వస్తుంటారు. వారి తల్లిదండ్రులు ఊళ్లలో ఉండి వీరికి చదువు కోసం డబ్బులు పంపుతుండగా.. పలువురు విద్యార్థులు మాదకద్రవ్యాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.