అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad CP Sajjanar Warning | ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో ఫేమస్ కావడానికి పలువురు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నైతికత, నిజాయితీతో సంబంధం లేకుండా రీల్స్ చేస్తున్నారు. మాదక ద్రవ్యాలు, బెట్టింగ్ యాప్లు (Betting Apps), లక్కీ డ్రాలను ప్రమోట్ చేస్తున్నారు. ఇలాంటి వారికి హైదరాబాద్ సీపీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు.
సీపీ సజ్జనార్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. రీల్స్ పేరుతో పిచ్చి వేషాలు వేసే వారికి వార్నింగ్లు ఇస్తుంటారు. తాజాగా ఇద్దరు యువకులు శివరాత్రి సందర్భంగా శివుడి ముందు మాదకద్రవ్యాలను చూపిస్తూ రీల్స్ చేశారు. గంజాయిని ప్రసాదంగా తీసుకొచ్చామని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందరు కొబ్బరికాయలు కొడతారని, శివుడికి గంజాయి ఇష్టమని అందులో వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోపై సీపీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Hyderabad CP Sajjanar Warning | భక్తికి నిదర్శనం
ఫేమస్ అవ్వడం కోసం ఎంతకైనా తెగిస్తారా అని సీపీ అన్నారు. మహాశివరాత్రి (Mahashivratri) భక్తికి నిదర్శనం.. ముక్తికి సోపానం. పరమ పవిత్రమైన ఈ పర్వదినాన, దైవ ప్రసాదం పేరుతో మత్తు పదార్థాలను ప్రదర్శించడం అత్యంత హేయమైన చర్య అన్నారు. ఇలాంటి వీడియోలు తీసిన వారిపై NDPS చట్టం ప్రయోగిస్తే.. జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి వస్తుందని హెచ్చరించారు. లైకుల కోసం లోకాన్నే మరిచి, మత్తులో మునిగి – జీవితాలను నాశనం చేసుకుంటారా అని ప్రశ్నించారు. క్షణికానందం ఇచ్చే లైకులు, వ్యూస్ కోసం భవిష్యత్తును బలిపెట్టొదని సూచించారు. ఇటువంటి చర్యలను చర్యలను ఉపేక్షించమని, బాధ్యులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.