HomeతెలంగాణIndigo Flight | ఎయిర్ ట్రాఫిక్.. హైద‌రాబాద్‌లో దిగాల్సిన విమానం విజ‌య‌వాడ‌లో ల్యాండింగ్..!

Indigo Flight | ఎయిర్ ట్రాఫిక్.. హైద‌రాబాద్‌లో దిగాల్సిన విమానం విజ‌య‌వాడ‌లో ల్యాండింగ్..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Indigo Flight | శంషాబాద్ విమానాశ్రయం(Shamshabad Airport) గగనతలంలో భారీగా ఏర్పడిన ఎయిర్ ట్రాఫిక్ కారణంగా, పుణె నుంచి వస్తున్న ఇండిగో విమానం విజయవాడకు మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మామూలుగా గంటా 20 నిమిషాల్లో గ‌మ్య‌స్థానానికి చేరుకోవాల్సి ఉండ‌గా, ఎయిర్ ట్రాఫిక్ రద్దీ వల్ల దాదాపు మూడు గంటలకు పైగా ఆలస్యం అయింది. అయితే విమానం సేఫ్‌గా ల్యాండ్ కావ‌డంతో ప్ర‌యాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Indigo Flight | టెన్ష‌న్.. టెన్ష‌న్

వివరాల్లోకి వెళితే… ఇండిగోకి చెందిన 6E-6473 విమానం ఆదివారం ఉదయం 8:43 గంటలకు పుణె విమానాశ్రయం(Pune Airport) నుంచి బయల్దేరింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10:03కి హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ అప్పటికే గగనతలంలో విమానాల రద్దీ అధికంగా ఉండటంతో, ల్యాండింగ్ క్లియరెన్స్ ఆలస్యం అయింది. ఈ నేపథ్యంలో, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(Air Traffic Control) నుంచి వచ్చిన సూచనల మేరకు పైలట్లు విమానాన్ని తాత్కాలికంగా విజయవాడ విమానాశ్రయానికి మళ్లించారు. విమానానికి ఫ్యూయల్ పరిమితులు, ప్రయాణికుల భద్రత దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల, ప్రయాణికులు రెండు గంటల పాటు విమానంలోనే ఉండాల్సి వచ్చింది. చివరకు మధ్యాహ్నం 12:38కి విమానం తిరిగి హైదరాబాద్‌ శంషాబాద్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.

విమానంలో ప్రయాణిస్తున్న వారు ఈ అనూహ్య పరిణామంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. విమానంలో చిన్నపిల్లలు, వృద్ధులు కూడా ఉండటం వల్ల వారికి ఆహారం ఇత‌ర అవసరాలు స‌మకూర్చ‌డంతో కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఏం జ‌రుగుతుందో కూడా విమాన‌ సిబ్బంది చెప్ప‌కుండా మౌనంగా ఉండ‌డంతో ఆందోళన కలిగించింది అని ఓ ప్రయాణికుడు చెప్పుకొచ్చారు. అయితే ఈ ఘటనపై ఇండిగో ఎయిర్‌లైన్స్(Indigo Airlines) ప్రతినిధులు స్పందించారు. ప్రయాణికుల భద్రతే తమకెప్పుడూ ప్రథమ ప్రాధాన్యమని, అత్యవసర పరిస్థితుల్లో విమానాన్ని మళ్లించాల్సి వచ్చిందని తెలిపారు. ఇటీవల శంషాబాద్ విమానాశ్రయంలో విమానాల రద్దీ, ల్యాండింగ్ ఆలస్యం వంటి ఘటనలు పదే పదే చోటుచేసుకుంటున్నాయి.

Must Read
Related News