అక్షరటుడే, వెబ్‌డెస్క్: Husband urinated on wife ఉత్తర్ప్రదేశ్లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఆడపిల్లకు జన్మనిచ్చిందనే కారణంతో ఓ మహిళపై భర్త, అత్తామామలు అమానుషంగా ప్రవర్తించారు. ఆమెపై భర్త మూత్ర విసర్జన చేసి, ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టాడు. బాధిత మహిళ ఫిర్యాదు ఆధారంగా కాన్పూర్ జిల్లా చకేరీ ఠాణాలో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధిత మహిళ భర్తతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం.. సదరు బాధిత మహిళకు ఫిబ్రవరి 19, 2022న కాన్పూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది. పెళ్లయిన కొన్ని నెలల నుంచే వరకట్న వేధింపులు మొదలయ్యాయి. భర్త, అత్తమామలు, మరదలు, కుటుంబ సభ్యులు సదరు మహిళను మానసికంగా, శారీరకంగా వేధించారు. పుట్టింటికి వెళ్లి రూ.5 లక్షల కట్నం తీసుకురావాలని పట్టుబట్టారు.
బాధిత మహిళ ఫిర్యాదులో.. “నేను అమ్మాయికి జన్మనిచ్చాక అత్తారింట్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. అత్తవారింట్లో అందరూ నన్ను కసురుకున్నారు. నా భర్త మద్యం మత్తులో నాపై మూత్రం పోశాడు. ఆగస్టు 14, 2024న ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. ప్రస్తుతం నా బిడ్డతో కలిసి పుట్టినింట్లో ఉంటున్నా. మద్యం, జూదం వ్యసనాల కోసం భర్త నా బంగారు ఆభరణాలు మొత్తం అమ్మేశాడు” అని వెల్లడించింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చకేరీ ఠాణా ఇంఛార్జి సంతోష్ కుమార్ శుక్లా తెలిపారు.
