Homeజిల్లాలుకామారెడ్డిKamareddy SP | ప్రియుడి మోజులో భర్త హత్య.. వివరాలు వెల్లడించిన ఎస్పీ

Kamareddy SP | ప్రియుడి మోజులో భర్త హత్య.. వివరాలు వెల్లడించిన ఎస్పీ

ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేయించిందో భార్య.. అలాగే జల్సాల కోసం వృద్ధురాలిని హత్య చేశాడో యువకుడు. ఈ ఘటనల వివరాలను బుధవారం కామారెడ్డి ఎస్పీ రాజేష్​ చంద్ర వెల్లడించారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను ఓ భార్య హత్య చేస్తే.. జల్సాలకు అలవాటు పడి వృద్ధురాలి మెడలో ఆభరణాలు అపహరించి హతమార్చాడు మరో ప్రబుద్ధుడు.

కామారెడ్డి జిల్లాలో జరిగిన రెండు హత్యలకు సంబంధించిన వివరాలను బుధవారం పోలీస్​ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) వెల్లడించారు. ఈనెల 16న గాంధారి (Gandhari) శివారులోని చద్మల్ రోడ్డులో కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉందని పంచాయతీ కార్యదర్శి నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నేరెల్​కు చెందిన ఓ యువకుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సీసీ కెమెరాల (CCTV cameras) ద్వారా నిందితులను గుర్తించారు.

ఈ కేసు వివరాలు.. మేడ్చల్ మల్కాజ్​గిరికి చెందిన నరేశ్​ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇలా పని చేసుకునే క్రమంలో ఆంజనేయులు అనే వ్యక్తితో నవనీతకు పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఒకరోజు బడాపహాడ్​ దర్గా (Badapahad Dargah) వద్దకు వెళ్దామని ముగ్గురు కలిసి రెండు బైక్​లపై వెళ్లారు. అక్కడ ఇద్దరు క్లోజ్​గా ఉండడం గమనించిన నరేశ్​ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. దాంతో నరేశ్​ అడ్డు తొలగించుకోవడానికి మరోసారి బడపహాడ్ వెళ్లి వద్దామని బయలుదేరారు. తిరిగి గాంధారికి రాగానే అక్కడ వైన్ షాపులో మద్యం తీసుకుని చద్మల్ రోడ్డులో నరేశ్​​కు తాగించారు.

మత్తులో ఉన్న నరేశ్​ ఛాతిపై దాడి చేసి హత్య చేశారు. మృతదేహాన్ని గుర్తు పట్టకుండా ఉండేందుకు పెట్రోల్ బంకులో పెట్రోల్ తీసుకుని.. శవాన్ని కాల్చి కాలువలో పడేసి వెళ్లిపోయారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు హైదరాబాద్​లో (Hyderabad) ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి ఒక బైక్, మొబైల్ స్వాధీనం చేసుకుని రిమాండ్​కు తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో కీలక సమాచారం అందించిన నేరెల్ యువకుడిని ఎస్పీ సన్మానించారు.

Kamareddy SP | జల్సాలకు అలవాటు పడి..

మరో కేసులో.. జల్సాలకు అలవాటు పడిన ఓ వ్యక్తి వృద్ధురాలి మెడలో ఆభరణాలు దొంగిలించి హత్య చేశాడని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. నస్రుల్లాబాద్​ (Nasrullabad) అంకోల్ తండాకు చెందిన గుగులోత్ రాధిబాయి అనే వృద్ధురాలు దీపావళి రోజున హత్యకు గురైందన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల విచారణలో వృద్ధురాలి ఇంటి ఎదురుగా ఉంటున్న మెగావత్ సవాయి సింగ్ అనే వ్యక్తి హత్యకు పాల్పడ్డాడని గుర్తించారు.

మద్యం తాగడం, పేకాట ఆడడం, ఇతర జల్సాలకు అలవాటు పడిన సవాయి సింగ్ దీపావళి రోజు వరుసకు నానమ్మ అయిన రాధిబాయి ఆశీర్వాదం తీసుకోవడానికి ఇంట్లోకి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వృద్ధురాలి చేతులకు ఉన్న రెండు కడియాలు దొంగిలించి వృద్ధురాలి తలను నేలకేసి కొట్టి గొంతు నులిమి హత్య చేశాడు.

అనంతరం అక్కడినుంచి పారిపోయే క్రమంలో బయట ఉన్న మరొక మహిళను గాయపర్చాడు. కడియాలు అమ్మడానికి బుధవారం వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. 2021లో మరొక వ్యక్తితో కలిసి బాన్సువాడ టీచర్స్ కాలనీలో ఉన్న బంధన్ ప్రైవేట్ బ్యాంక్​లో (Bandhan Private Bank) కంప్యూటర్ దొంగిలించిన కేసులో సవాయి సింగ్​ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అలాగే చిన్నచిన్న చోరీలు చేసి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. ఇతనిపై నస్రుల్లాబాద్​ పోలీస్ స్టేషన్​లో సస్పెక్ట్ షీట్ ఉందని ఎస్పీ తెలిపారు. నిందితుని నుంచి వెండి కడియాలు స్వాధీనం చేసుకుని రిమాండ్​కు తరలిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు.