అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | డబ్బు సంపాదన కోసం దారి దోపిడీలు చేస్తున్న భార్యాభర్తల ఆట కట్టించారు కామారెడ్డి పోలీసులు. వీరిరువురిని మంగళవారం అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపించారు.
వివరాలను ఎస్పీ రాజేష్ చంద్ర మీడియాకు వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 10న రాజంపేట (Rajampet) మండలం బస్వన్నపల్లి గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి ప్యారడైజ్ హోటల్లో (Paradise Hotel) పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా సీఎస్ఐ చర్చి (CSI Church) వద్ద ఓ మహిళ బైక్ లిఫ్ట్ అడిగింది. తనను సరంపల్లి వద్ద డ్రాప్ చేయాలని కోరింది.
బైక్ ఎక్కిన అనంతరం తన భర్తకు ఫోన్ చేసి బైక్ ఎక్కి వస్తున్నానని సమాచారం అందించింది. ఈఎస్ఆర్ గార్డెన్ (ESR Garden) వద్దకు వెళ్లగానే ఆ మహిళ భర్త మరొక బైక్పై వచ్చి రాజు బైక్ను నిలిపివేసి అతనిపై దాడిచేసి అతని వద్ద ఉన్న రూ.2వేల నగదు, ఫోన్ లాక్కుని భార్యాభర్తలు పారిపోయారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కామారెడ్డి పట్టణంలో నివాసం ఉంటున్న దామరకుంటకు చెందిన బైండ్ల భాగ్య, ఆమె రెండో భర్త లింగంపేట మండలం మత్తడికింది పల్లి గ్రామానికి చెందిన రాయసాని రవికుమార్లుగా గుర్తించారు. దోపిడీ అనంతరం తప్పించుకు తిరుగుతున్న వారిరువురిని పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు.
పోలీసుల విచారణలో డబ్బు సంపాదన కోసమే ఒంటరిగా ఉన్న వాళ్లను లిఫ్ట్ పేరుతో వారి బైక్పై వెళ్లి డబ్బులు తీసుకుని పారిపోతున్నట్లు ఒప్పుకున్నారు. భార్యభర్తలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. వారి నుంచి రూ.600 నగదు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, పట్టణ సీఐ నరహరి పాల్గొన్నారు.