అక్షరటుడే, కామారెడ్డి: Hung in Kamareddy | జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో(Municipal Elections) ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుందలో ఏకపక్ష ఫలితాలు రాగా కామారెడ్డి మున్సిపాలిటీ ప్రజలు మాత్రం విలక్షణ తీర్పునిచ్చారు. ఇక్కడ ఏ పార్టీకి కూడా మెజారిటీ రాలేదు. ఎవరికి మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దాంతో కామారెడ్డి మున్సిపాలిటీపై జెండా ఎగరవేసేది ఎవరన్న చర్చ జోరుగా సాగుతోంది.
Hung in Kamareddy | కామారెడ్డి మున్సిపాలిటీలో..
కామారెడ్డి మున్సిపాలిటీలో 49 వార్డులున్నాయి. ఇందులో 1,49,525 మంది ఓటర్లు ఉండగా 1,03, 895 మంది ఓటేశారు. శుక్రవారం కౌంటింగ్ నిర్వహించగా ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి 19 స్థానాలు, బీజేపీకి 16, బీఆర్ఎస్కు 11, స్వతంత్ర అభ్యర్ధులు ముగ్గురు విజయం సాధించారు.
ఛైర్మన్ కోసం చర్చ..
కామారెడ్డి మున్సిపాలిటీలో (Kamareddy Municipality) 49 వార్డులు ఉండగా ఇందులో 25 కౌన్సిలర్ స్థానాలు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అభ్యర్థి ఛైర్మన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏ పార్టీకి 20 స్థానాలు కూడా రాలేకపోయాయి. దాంతో ఇప్పుడు ఛైర్మన్ ఎవరనేది చర్చ సాగుతోంది. కామారెడ్డి మున్సిపాలిటీ చరిత్రలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఏ పార్టీ అభ్యర్థులు ఎవరికి మద్దతిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
పుంజుకున్న బీజేపీ..
గత మున్సిపల్ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచిన బీజేపీకి ఈసారి 16 స్థానాలు దక్కాయి. దాంతో కామారెడ్డి పట్టణంలో బీజేపీ పుంజుకుందన్న చర్చ సాగుతోంది. మొదటి నుంచి కామారెడ్డి మున్సిపాలిటీలో ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుందని ప్రచారం సాగగా ఎన్నికల ఫలితాలలో అదే నిజమైంది. గత మున్సిపాలిటీ ఎన్నికల్లో 23 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ ఆరుగురు స్వతంత్ర అభ్యర్ధులు చేరికతో ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం 11 స్థానాల్లో గెలవడంతో బీఆర్ఎస్ మద్దతు కాంగ్రెస్, బీజేపీలకు అనివార్యం అయిందన్న చర్చ సాగుతోంది. అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్కు సపోర్ట్ చేయకపోతే బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది తెలియాల్సి ఉంది. బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేస్తే ఆ పార్టీ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది.