అక్షరటుడే, బోధన్: Bodhan | మానవ హక్కుల వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి మాధవరావు (Gorrepati Madhava Rao) ప్రథమ వర్ధంతి సభను విజయవంతం చేయాలని జిల్లా ప్రతినిధులు కోరారు. ఈ నెల 28న ఆదివారం ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్టలో సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
బోధన్ పట్టణంలోని (Bodhan town) పీఆర్టీయూ భవన్లో బుధవారం మాధవరావు స్మారకోపన్యాస సభ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మానవ హక్కుల వేదిక జిల్లా ప్రతినిధి, న్యాయవాది జి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. గొర్రెపాటి మాధవరావు నాలుగు దశాబ్దాలకు హక్కుల ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారన్నారు. అణగారిన వర్గ పేద ప్రజల హక్కుల కోసం గొంతుకనై నిలిచారని పేర్కొన్నారు. ప్రజాస్వామిక, రాజ్యాంగ బద్ధ హక్కుల రక్షణ అంశాలపై తన రచనలు, చర్చల ద్వారా ప్రజలను చైతన్యం చేశారన్నారు. హక్కుల ఉద్యమంలో మాధవరావు కృషి మరువలేనిదన్నారు.
Bodhan | సభకు హాజరుకానున్న ప్రముఖులు
స్మారకోపన్యాస సభకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారని శ్రీనివాస్ తెలిపారు. నల్సార్ న్యాయశాస్త్ర యూనివర్సిటీ వీసీ శ్రీకృష్ణ దేవరావు, మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు జీవన్ కుమార్, వక్తలుగా రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ఎం.రాజేందర్ రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ట్రస్ట్ ప్రతినిధి ఆకుల పాపయ్య, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయిరెడ్డి, మాజీ అధ్యక్షుడు ఆకుల రమేష్, రాష్ట్ర, వివిధ జిల్లాల హెచ్ ఆర్ఎఫ్ ప్రతినిధులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది సీహెచ్ హన్మంతరావు, సీనియర్ మాజీ కౌన్సిలర్ పరుచూరి మురళి కృష్ణ, జిల్లా మహిళ సాధికారత కో–ఆర్డినేటర్ పిట్ల స్వప్న, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు పుట్ట లక్ష్మి, విద్యావేత్త నాగళ్ల హన్మంతరావు, మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు గడ్డం గంగులు, ప్రతినిధి అరుణ్ కుమార్, సురేష్, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రతినిధి సొంపూర్ పోచిరాం, బీడీఎల్ఎఫ్ డివిజన్ కార్యదర్శి దాల్ మల్కా పోశెట్టి, పీడీఎస్యూ, ఏఐబీఎస్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ కుమార్, నాగరాజు పాల్గొన్నారు.