అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Riyaz Encounter | నిజామాబాద్ (Nizamabad) నగరంలో ఇటీవల చోటు చేసుకున్న రియాజ్ ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. మీడియా కథనాల ఆధారంగా ఎన్‌కౌంటర్ ఘటనను సుమోటోగా స్వీకరించింది. నవంబర్ 24లోగా ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.
పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్‌ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అతడు కానిస్టేబుల్ ప్రమోద్ (Constable Pramod)పై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితుడు రియాజ్ పారిపోగా.. పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించి అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో రియాజ్ (Riyaz) మరోసారి పోలీసులపై దాడి చేశాడు. ఈ సమయంలో రియాజ్ సైతం గాయపడ్డాడు. దీంతో అతడిని నిజామాబాద్ జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో సోమవారం రియాజ్ పోలీసులు తుపాకీ లాక్కొని కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా జరిపిన కాల్పుల్లో రియాజ్ హతం అయ్యాడు.
Riyaz Encounter | సుమోటోగా విచారణ
ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్ (Telangana Human Rights Commission) స్పందించింది. ఈ సంఘటన కస్టడీ పరిస్థితులకు సంబంధించినది, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద జీవించే హక్కుకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతుందని కమిషన్ అభిప్రాయ పడింది. ఈ విషయం తీవ్రత, మానవ హక్కుల చిక్కుల దృష్ట్యా సుమోటో (Sumoto)గా విచారణకు తగిన కేసు అని కమిషన్ అభిప్రాయపడింది. ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిస్థితులు, మెజిస్టీరియల్ విచారణ స్థితి, ఆదేశించిన ఏవైనా శాఖాపరమైన/న్యాయపరమైన చర్యలు, ఎన్‌కౌంటర్ మరణాలపై ఎన్హెచ్ఆర్సీ, సుప్రీంకోర్టు (Supreme Court) మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండటం, FIR కాపీ, పోస్ట్‌మార్టం నివేదికతో సహా వివరణాత్మక వాస్తవ నివేదికను సమర్పించాలని డీజీపీని ఆదేశించింది.