అక్షరటుడే, వెబ్‌డెస్క్ : LB Nagar Metro | దసరా పండుగ ముగియడంతో ఊళ్ల నుండి తిరిగి వచ్చే ప్రయాణికులతో హైదరాబాద్‌లో రద్దీ పెరిగిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, మెట్రో స్టేషన్లు కిక్కిరిసి పోయాయి. ముఖ్యంగా ఎల్బీనగర్ ప్రాంతం, చౌటుప్పల్ హైవే(Choutuppal Highway)పై ట్రాఫిక్ పరిస్థితి ఊహించని విధంగా ఉంది.
ఎల్బీనగర్ మెట్రో(LB Nagar Metro) స్టేషన్ వద్ద ప్రయాణికులు గుంపులుగా చేరటంతో ప్లాట్‌ఫారంపై కదలికలు సైతం కష్టంగా మారాయి. వాహనాలు కదలక పోవడం, ట్రాఫిక్‌లో గంటల తరబడి ఇరుక్కుపోవడంతో వేలాది మంది మెట్రో రైలు వైపు మొగ్గారు. దీనివల్ల మెట్రో స్టేషన్లో కిలోమీటర్ల మేర క్యూలైన్లు ఏర్పడ్డాయి.
LB Nagar Metro | ఎటు చూసిన క్యూలే..
ప్రయాణికులు క్యూలో నిల్చొని ప్లాట్‌ఫారంపైకి చేరేందుకు రెండు గంటల వరకూ సమయం పడుతుండటంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ రద్దీని అదుపులోకి తెచ్చేందుకు మెట్రో సిబ్బంది క్యూ వ్యవస్థను అమలు చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్(Hyderabad) వైపు వస్తున్న వాహనాల వల్ల చిట్యాల నుంచి పెద్దకాపర్తి వరకు వాహనాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ కదలికలు నెమ్మదించాయి. అయితే, పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
దసరా సెలవుల కోసం జిల్లా ప్రాంతాలకు వెళ్లిన ఉద్యోగులు, విద్యార్థులు తిరిగి నగరానికి ఒక్కసారిగా బయలుదేరడంతో ఈ రద్దీ నెలకొంది. నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ రోడ్డు, రైలు, బస్సు స్టేషన్లలో భారీ గుంపులు కనిపిస్తున్నాయి. మొత్తంగా, దసరా సెలవుల అనంతరం హైదరాబాద్ కి వచ్చే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో , నగర ట్రాఫిక్ పోలీస్(Traffic Police) , ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలన్నీ ఒత్తిడికి గురవుతున్నాయి.. అధికారులు ప్రజలకు సహకరించేలా సమర్థవంతమైన పద్ధతుల్లో నడిపించేందుకు యత్నిస్తున్నారు. ప్రయాణికులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతూ ఇంటికి ఎప్పుడు చేరుకుంటామా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.