అక్షరటుడే, హైదరాబాద్: TGS RTC | బస్సు ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) శుభవార్త తెలిపింది. హైదరాబాద్ నుంచి విజయవాడ (Vijayawada) మార్గంలో టికెట్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
TGS RTC | ఏ బస్సులో ఎంత తగ్గింపు అంటే..
హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో నడిచే బస్సుల ఆధారంగా ఈ తగ్గింపు వర్తించనుంది. గరుడ బస్ టికెట్ ధరలపై 30 శాతం తగ్గిస్తోంది ఆర్టీసీ సంస్థ. ఈ-గరుడ బస్ టికెట్ ధరలపై 26 శాతం తగ్గించడం గమనార్హం. సూపర్ లగ్జరీ, లహరి నాన్ ఏసీ బస్సుల టికెట్లపై 20 శాతం మేర తగ్గించింది. రాజధాని Rajdhani, లహరి Lahari ఏసీ బస్సుల్లో టికెట్ ధరలపై 16 శాతం తగ్గించడం విశేషం.
TGS RTC | పెరిగిన బస్ పాస్ ధరలు..
విజయవాడ మార్గంలో టికెట్ ధరలపై రాయితీ ప్రకటించిన టీజీఎస్ ఆర్టీసీ సంస్థ హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో మాత్రం బాదుతోంది. సిటీ బస్సుల్లో బస్ పాస్ రేట్లను జూన్‌లోనే పెంచి అమలు చేస్తోంది. ఆర్డినరీ బస్ పాస్‌లపై 23 శాతం పెంచింది. స్టూడెంట్ బస్ పాస్‌లపై ఏకంగా 50 శాతం రేట్లు పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకోవడం ఆందోళన కలిగించే విషయం.
TGS RTC | మూడేళ్లుగా పెంచలేదని…
గత మూడేళ్లుగా స్టూడెంట్ బస్ పాస్ రేట్లు పెంచలేదని ఆర్టీసీ సంస్థ తెలిపింది. ఆర్థిక భారం తగ్గించుకునేందుకే పెంచినట్లు చెప్పుకొచ్చింది. కాగా, ఈ విద్యా సంవత్సరంలో మెట్రో ఎక్స్ ప్రెస్లోనూ స్టూడెంట్స్ ప్రయాణించేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది.
TGS RTC | టోల్ ఛార్జీల సవరణ..
టోల్ ప్లాజా యూజర్ ఛార్జీలను సైతం సవరించినట్లు టీజీఎస్ ఆర్టీసీ సంస్థ వెల్లడించింది. టోల్ గేట్ మీదుగా వెళ్లే ప్రతి ప్రయాణికుడు అదనంగా ప్లాజాకు రూ.10 చెల్లించాలని ప్రకటించింది. టోల్ గేట్ లేకపోతే చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
TGS RTC | అక్కడ రాయితీ.. ఇక్కడ మోత..!
స్థానికంగా లోకల్లో తిరిగే స్టూడెంట్ బస్ పాస్‌లపై భారీగా పెంచిన టీజీఎస్ ఆర్టీసీ సంస్థ.. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే ప్రయాణికులకు రాయితీ ప్రకటించడంపై సర్వత్రా చర్చకు దారితీసింది. సంస్థపై ఆర్థిక భారం పడుతుందని కుంటిసాకులు చెప్పి, హైదరాబాద్ మహానగరంలో ప్రయాణికులకు బస్‌పాస్‌లపై భారం మోపిన సంస్థ.. సుదూర ప్రయాణికులకు మాత్రం రాయితీలు కల్పించడంపై విమర్శలు వస్తున్నాయి. దీనికితోడు టోల్ గేట్‌కు రుసుం చెల్లించాల్సి ఉంటుందని ఒకవైపు చెబుతూనే.. మరోవైపు రాయితీ తాయిలాలు ఇవ్వడం వెనుక మర్మమేమిటో టీజీఎస్ ఆర్టీసీ సంస్థనే తెలపాలి.