అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Police | హైదరాబాద్ (Hyderabad) నగరంలో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. బండ్లగూడ పోలీస్ స్టేషన్ (Bandlaguda Police Station) పరిధిలో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.2.70 కోట్ల విలువైన 908 కిలలో పొడి గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ (DCP Chaitanya Kumar) వివరాలు వెల్లడించారు. గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఒడిశాలోని మల్కన్‌గిరి ప్రాంతం నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయి రవాణా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో మొహమ్మద్ కలీం ఉద్దీన్ డ్రైవర్/ గంజాయి ట్రాన్స్‌పోర్టర్, షేక్ సోహైల్, మొహమ్మద్ అఫ్జల్ అలియాస్ అబ్బులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో పలువురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు డీసీపీ తెలిపారు.
Hyderabad Police | ఒడిశా నుంచి..
ఒడిశాలోని మల్కన్‌గిరిలో మారుమూల అటవీ ప్రాంతంలో సురేష్, జిథు గంజాయిని కొనుగోలు చేస్తున్నారు. దానిని మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేయడానికి ప్లాన్ చేశారు. గంజాయి రవాణాలో రహమాన్ ప్రధాన రవాణాదారుడిగా వ్యవహరిస్తున్నాడు. వీరి నుంచి మహారాష్ట్రకు చెందిన మహేష్ గంజాయిని కొనుగోలు చేస్తాడు. గంజాయిని హెచ్‌డీపీఈ సంచుల్లో నింపి, జీడిపప్పు కింద దాచిపెట్టి రవాణా చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పక్కా సమాచారంతో బండ్లగూడ వద్ద దాడి చేసి నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు.
