Homeతాజావార్తలుIPO | ప్రైమరీ మార్కెట్‌లోకి భారీ ఐపీవోలు.. నేటినుంచి ‘టాటా’.. రేపటినుంచి ఎల్‌జీ..

IPO | ప్రైమరీ మార్కెట్‌లోకి భారీ ఐపీవోలు.. నేటినుంచి ‘టాటా’.. రేపటినుంచి ఎల్‌జీ..

ఈ వారం స్టాక్​ మార్కెట్​లో ఐపీవోలు సందడి చేయనున్నాయి. టాటా క్యాపిటల్, ఎల్​జీ వంటి పెద్ద కంపెనీలు రూ.27 వేల కోట్లు సమీకరించడానికి ఐపీవోకి వచ్చాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IPO | ప్రైమరీ మార్కెట్‌(Primary market)లోకి కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఈ వారంలో రెండు భారీ ఐపీవోలు వస్తున్నాయి. మెయిన్‌బోర్డ్‌(Main board)నుంచి వస్తున్న టాటా క్యాపిటల్‌, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఐపీవోలు రెండు కలిపి రూ. 27 వేల కోట్లపైన సమీకరించనున్నాయి.

రూబికాన్‌ రీసెర్చ్‌, కెనరా రొబేకో, కెనరా హెచ్‌ఎస్‌బీసీల సబ్‌స్క్రిప్షన్‌ కూడా ఈ వారంలోనే ప్రారంభం కానుంది. అలాగే ఈ వారంలో రికార్డు స్థాయి ఐపీవో వస్తోంది. టాటా క్యాపిటల్‌(Tata capital) రూ. 15,512 కోట్లతో పబ్లిక్‌ ఇష్యూకు వస్తున్న విషయం తెలిసిందే. గతంలో చివరిసారి(గతేడాది అక్టోబర్‌లో) హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా రూ. 27,859 కోట్లతో ఐపీవోకు వచ్చిన విషయం తెలిసిందే.

IPO | టాటా క్యాపిటల్‌..

నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ అయిన టాటా క్యాపిటల్‌(Tata Capital) సబ్‌స్క్రిప్షన్‌ సోమవారం ప్రారంభమై 8వ తేదీ వరకు కొనసాగనుంది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 15,512 కోట్లు సమీకరించనుంది. 9న అలాట్‌మెంట్‌ స్టేటస్‌ వెలువడే అవకాశాలు ఉన్నాయి. కంపెనీ షేర్లు ఈనెల 13న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి. ఈ ఏడాది పబ్లిక్‌ ఇష్యూకు వస్తున్న అతిపెద్ద కంపెనీ ఇది.

IPO | ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌..

గృహోపకరణాలు, వినియోగదారు ఎలక్ట్రానిక్స్‌ తయారీదారు అయిన ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా(LG Electronics India) రూ.11,607 కోట్లు సమీకరించేందుకు పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. ఒక్కో షేరు ధరను రూ.1,080 నుంచి రూ. 1,140 గా నిర్ణయించింది. మంగళవారం నుంచి గురువారం వరకు సబ్‌స్క్రిప్షన్‌ విండో తెరిచి ఉంటుంది. అలాట్‌మెంట్‌ స్టేటస్‌ 10న వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. కంపెనీ షేర్లు 14న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్‌ కానున్నాయి.

IPO | రూబికాన్‌ రీసెర్చ్‌..

ఫార్మాస్యూటికల్‌ సంస్థ అయిన రూబికాన్‌ రీసెర్చ్‌(Rubicon Research) ఐపీవో 9న ప్రారంభమవుతుంది. 13 వరకు సబ్‌స్క్రిప్షన్‌కు అవకాశం ఉంది. 14న అలాట్‌మెంట్‌ స్టేటస్‌ వెల్లడవుతుంది. 16న కంపెనీ షేర్లు లిస్టవుతాయి. ఒక్కో షేరు ధర గరిష్ట ప్రైస్‌ బాండ్‌ వద్ద రూ. 485గా నిర్ణయించింది. ఈ ధర వద్ద కంపెనీ రూ.1,377.50 కోట్లను సేకరించనుంది.

IPO | కెనరా రొబేకో..

మెయిన్‌బోర్డ్‌ విభాగం నుంచి వస్తున్న మరో ఐపీవో కెనరా రొబేకో(Canara Robeco). కెనరా రోబెకో అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూ అక్టోబర్‌ 9న ప్రారంభమై 13న ముగుస్తుంది. 14న అలాట్‌మెంట్‌ స్టేటస్‌ వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ఐపీవో ద్వారా 4.98 కోట్ల షేర్లను విక్రయించనుంది. ప్రైస్‌బ్యాండ్‌ వివరాలు తెలియాల్సి ఉంది.

IPO | కెనరా హెచ్‌ఎస్‌బీసీ..

కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్‌ ఇన్సూరెస్స్‌ కంపెనీ(Canara HSBC Life Insurance Company) ఐపీవో కూడా ఈ వారంలోనే ప్రారంభం కానుంది. 10 నుంచి 14వ తేదీ వరకు సబ్‌స్క్రిప్షన్‌ స్వీకరిస్తారు. ఇష్యూ సైజ్‌, ప్రైస్‌ బ్యాండ్‌ తదితర వివరాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది.

IPO | ఎస్‌ఎంఈ విభాగం నుంచి ఒక్కటే..

ఈ వారంలో ఎస్‌ఎంఈ విభాగం నుంచి ఒకే ఒక్క కంపెనీ ఐపీవోకు వస్తోంది. స్ట్రక్చరల్‌ స్టీల్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ మిట్టల్‌ సెక్షన్స్‌(Mittal Sections) మార్కెట్‌నుంచి రూ. 52.91 కోట్లను సమీకరించనుంది. సబ్‌స్క్రిప్షన్‌ అక్టోబర్‌ 7 నుంచి 9 తేదీలలో కొనసాగనుంది. ప్రైస్‌ బ్యాండ్‌ రూ. 136 నుంచి రూ. 143గా నిర్ణయించారు. 10న అలాట్‌మెంట్‌ స్టేటస్‌ వెల్లడవనుంది. కంపెనీ షేర్లు ఈనెల 14న బీఎస్‌ఈలో లిస్టవుతాయి.

IPO | లిస్టింగ్‌లు..

వచ్చే వారంలో మెయిన్‌బోర్డ్‌ విభాగం నుంచి ఆరు, ఎస్‌ఎంఈనుంచి 22 కంపెనీలు లిస్టవనున్నాయి. మెయిన్‌ బోర్డ్‌కు చెందిన పేస్‌ డిజిటెక్‌(Pace Digitek) అక్టోబర్‌ 6న, గ్లోటిస్‌ మరియు ఫ్యాబ్‌టెక్‌ టెక్నాలజీస్‌ అక్టోబర్‌ 7న లిస్ట్‌ చేయబడతాయి. ఓమ్‌ ఫ్రైట్‌ ఫార్వర్డర్స్‌ మరియు అడ్వాన్స్‌ ఆగ్రోలైఫ్‌(Advance Agrolife) షేర్ల ట్రేడిరగ్‌ అక్టోబర్‌ 8న మొదలవుతుంది. వీవర్క్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ కంపెనీ అక్టోబర్‌ 10న మార్కెట్‌లోకి అడుగు పెడుతుంది.