అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana | తెలంగాణ రాష్ట్రంలో అబార్షన్లు (Abortions) భారీగా పెరిగాయి. ఐదేళ్ల గర్భస్రావాలు ఏకంగా పది రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో 1,578 అబార్షన్లు జరగగా.. 2024–25వరకు ఆ సంఖ్య 16,059కు చేరింది. అంటే పది రెట్ల కంటే ఎక్కువగా పెరుగుదల నమోదు కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) 2,282 నుంచి 10,676కి నాలుగు రెట్లు పెరుగుదల కనిపించింది. వైద్యపరంగా అబార్షన్లు (medical termination of pregnancy) చోటు చేసుకుంటున్న రాష్ట్రంలో మహారాష్ట్ర, తమిళనాడు, అస్సాం, కర్ణాటక, రాజస్థాన్ మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. లక్ష ద్వీప్‌లో అత్యల్పంగా 20 అబార్షన్లు నమోదయ్యాయి.
Telangana | కారణాలు ఏమిటి..
ప్రస్తుతం చాలా మంది జంటలను పిల్లలను కనాలని ఆనుకోవడం లేదు. ముఖ్యంగా ఉన్నత చదువులు చదివి నగరాల్లో కొలువులు చేస్తున్న దంపతులు పిల్లలపై ఆసక్తి చూపడం లేదు. దీంతో ఇప్పటికే దేశంలో జనాభా వృద్ధి రేటు పడిపోయింది. ఇలాంటి వారు ఒక వేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్ఫ్ అయితే అబార్షన్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
రాష్ట్రంలో చాలామంది సరైన పౌష్టికాహారం అందక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల గర్భిణులకు సరైన ఆహారం అందడం లేదు. దీంతో వారు బిడ్డలను కనాలని కలలు కంటున్నా.. అబార్షన్లు అవుతున్నాయి.
Telangana | సహజీవన సంస్కృతితో..
దేశంలోని మెట్రో నగరాల్లో సహజీవన సంస్కృతి విచ్చల విడిగా పెరిగిపోయింది. హైదరాబాద్ (Hyderabad) లాంటి నగరాల్లో కో లివింగ్ రూమ్‌లు అందుబాటులో ఉంటున్నాయి. ఇలాంటి వారు సైతం కలిసి ఉన్నన్ని రోజులు బాగానే ఉన్నా.. మనస్పర్థలు రావడంతో కడుపులో పెరుగుతున్న శిశువును తొలగించుకోవాలని చూస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా అబార్షన్లు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 2020–21లో 5,34,008 అబార్షన్లు జరగ్గా.. 2024–25కు ఆ సంఖ్య 8,93,372కు పెరిగింది. ఈ మేరకు రాజ్యసభ (Rajya Sabha)లో అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది.
Telangana | లెక్కకు రానివి ఎన్నో..
దేశంలో లెక్కల్లోకి రాకుండా వేలాది అబార్షన్లు జరుగుతున్నాయి. ఆర్ఎంపీలు సైతం అబార్షన్లు చేస్తున్నారు. టాబ్లెట్లు ఇచ్చి అబార్షన్ అయ్యేలా చేస్తున్నారు. ఇలాగే నిజామాబాద్‌లో ఓ మహిళలకు టాబ్లెట్లు ఇవ్వగా.. ఆమెకు తీవ్ర రక్తస్రావం అయి చనిపోయింది. చాలా గ్రామాల్లో ఆర్ఎంపీలు అనధికారికంగా అబార్షన్లు చేస్తూ.. మహిళల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.