అక్షరటుడే, వెబ్డెస్క్ : Mumbai Airport | ముంబయి ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు (Customs Officers) భారీగా గంజాయి, బంగారం స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న పలువురు ప్రయాణికుల నుంచి వీటిని సీజ్ చేశారు. బ్యాంకాక్ నుంచి వివిధ విమానాలలో వచ్చిన 12 మంది ప్రయాణికులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ (Chhatrapati Shivaji Maharaj) అంతర్జాతీయ విమానాశ్రయంలో డిసెంబర్ 3 నుంచి 10 మధ్య నిర్వహించిన ఆపరేషన్లలో వీటిని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ సిబ్బంది తొమ్మిది మంది ప్రయాణికులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.37.26 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు బుధవారం ఒక అధికారి తెలిపారు.
Mumbai Airport | కేసు నమోదు
మరో ఆపరేషన్లో బ్యాంకాక్ (Bangkok) నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల నుండి రూ.6 కోట్ల విలువైన 6 కిలోల అనుమానిత హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశారని ఆయన చెప్పారు. నలుగురు ప్రయాణికుల నుంచి రూ.1.51 కోట్ల విలువైన బంగారాన్ని, మరొక వ్యక్తి నుంచి రూ.87.75 లక్షల విలువైన వజ్రాలను స్వాధీనం చేసుకుని, అక్రమ రవాణా ఆరోపణలపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
కాగా ఇటీవల కస్టమ్స్ అధికారులు దేశవ్యాప్తంగా భారీగా బంగారం (Gold) , డ్రగ్స్ స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి వీటిని పట్టుకుంటున్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి వస్తున్న గంజాయిని అడ్డుకోవడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తనిఖీలను ముమ్మరం చేశారు.