అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pakistan | పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఇస్లామాబాద్‌లోని కోర్టు ఆవరణలో కారులో వచ్చి దాడి చేశారు. ఈ ఘటనలో 12 మంది మృతి, 21 మందికి గాయాలు అయ్యాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో మంగళవారం మధ్యాహ్నం జ్యుడీషియల్ కాంప్లెక్స్ సమీపంలో పేలుడు చోటు చేసుకుంది. ఇప్పటి వరకు 12 మంది మృతి చెందగా.. ఎక్కువ మంది న్యాయవాదులేనని సమాచారం. కోర్టు గేటు వద్ద పార్క్ చేసి ఉన్న ఓ కారులో ఈ పేలుడు చోటు చేసుకుంది. అత్యంత రద్దీగా ఉండే సమయంలో ఘటన జరగడంతో ఎక్కువ మంది చనిపోయారు. పేలుడు తీవ్రతకు సమీపంలోని పలు వాహనాలు సైతం ధ్వంసం అయ్యాయి.
కాగా.. ఈ పేలుడుకు ముందు వజీరిస్థాన్‌లో పాక్ భద్రతా దళాలు ఓ ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి. వానాలోని కేడెట్ కాలేజీపై తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్తాన్ (TTP) ఉగ్రవాదులు దాడికి యత్నించగా.. బలగాలు అడ్డుకున్నాయి. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. అనంతరం కారు పేలుడు చోటుచేసుకోవడం గమనార్హం.
Pakistan | దాడికి పాల్పడింది తాలిబన్లు!
ఇస్లామాబాద్‌లో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో కనీసం 12 మంది మరణించారని పాకిస్తాన్ తాలిబన్లు పేర్కొన్నారు. ఆ దేశ రాజధానిపై ఆ ఉగ్రవాద సంస్థ చేసిన అరుదైన దాడి ఇది. ఈ ఘటనతో ప్రజలు భయాందోళనకు గురై పారిపోయారు. ఇస్లామిక్ వ్యతిరేక చట్టాల ప్రకారం తీర్పులు అమలు చేసిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, అధికారులను లక్ష్యంగా చేసుకున్నట్లు పాకిస్తాన్ తాలిబన్ తెలిపింది. దేశంలో ఇస్లామిక్ చట్టం అమలు అయ్యే వరకు మరిన్ని దాడులు చేస్తామని బెదిరించింది.
