అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలో మరోసారి పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. మియాపూర్ (Miyapur)లో 4.25 కిలోల గసగసాలను శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు (SOT Police) స్వాధీనం చేసుకున్నారు.
నగరంలో ఇటీవల డ్రగ్స్ దందా జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. డ్రగ్స్, గంజాయికి బానిసలుగా మారి ఎంతో మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అయితే గంజాయి మాదిరిగా మత్తు ఇచ్చే గసగసాలను కూడా కొందరు విక్రయిస్తున్నారు. విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్న డ్రగ్స్ దందా ఆగడం లేదు. ఇప్పటికే ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనకు ఈగల్ టీమ్ (Eagle Team)ను ఏర్పాటు చేసింది. ఈగల్ టీమ్ పోలీసులు తరచూ దాడులు చేపడుతున్నారు.
Hyderabad | రాజస్థాన్ నుంచి..
ఈగల్ టీమ్‌తో స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) పోలీసులు సైతం ఇటీవల డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రత్యేక తనిఖీలు చేపట్టి గంజాయి, డ్రగ్స్ రవాణా చేస్తున్న వారి ఆట కట్టిస్తున్నారు. తాజాగా శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు 4.25 కిలోల గసగసాలు పట్టుకున్నారు. రాజస్థాన్ నుంచి వీటిని స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కార్పెంటర్‌గా పని చేస్తున్న మన్ని రామ్ అనే వ్యక్తి వీటిని విక్రయిస్తున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ విక్రయాలు చేపడుతున్నాడు. మన్ని రామ్‌తో పాటు మరోవ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఎన్డీపీఎస్ (NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.