అక్షరటుడే, కామారెడ్డి: cyber crime : ఓ వ్యక్తికి మనీ లాండరింగ్ కేసు(Money laundering case) పేరుతో ఫోన్ చేసి రూ. 5.80 లక్షలను సైబర్ నేరగాళ్లు తమ అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేసుకోగా.. గంటల వ్యవధిలో పోలీసులు బాధితుని అకౌంట్లోకి నగదు మళ్లించారు. ఈ ఘటన కామారెడ్డి(Kamareddy) పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది.
పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి పట్టణానికి చెందిన లోకుల రాజేందర్ అనే వ్యక్తికి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వాట్సప్ ద్వారా వీడియో కాల్ చేసి టెలికాం సర్వీస్ నుంచి మాట్లాడుతున్నామన్నారు. మీ ఆధార్ కార్డు మీద ఎవరో సిమ్ కార్డు తీసుకోవడం వల్ల మీ మీద మనీలాండరింగ్ కేసు నమోదైందని నమ్మించారు.
అతని ఆధార్ కార్డ్(Aadhaar card) తమ దగ్గర ఉందని, ముంబయి పోలీసులు(Mumbai Police) అరెస్టు చేయడానికి వస్తున్నారని భయపెట్టారు. కొంత సమయానికి వాట్సప్ లో వీడియో కాల్ చేసి అకౌంట్లో ఎంత డబ్బు ఉందో చెప్పాలని, ఆ డబ్బును తమ అకౌంట్ కి పంపమని, లేదంటే అరెస్టు చేస్తామని ముంబయి పోలీసులతో కూడిన ఒక ఫేక్ నోటీసు అతనికి పంపించి భయపెట్టారు. దాంతో భయపడిన రాజేందర్ సిరిసిల్ల రోడ్డులోని ఎస్బీఐ బ్యాంకు(SBI Bank)లో తన అకౌంటులో ఉన్న రూ. 5,80,000 గుర్తు తెలియని వ్యక్తులు పంపించిన అకౌంట్ నెంబరుకు ట్రాన్స్ ఫర్ చేశాడు.
ఆ తర్వాత అనుమానం వచ్చి వెంటనే రాజేందర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అలా బ్యాంకు మేనేజర్ కు పోలీసులు ఫోన్ చేసి విషయం చెప్పడంతో పాటు సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేసి సంబంధిత బ్రాంచ్ మేనేజర్ ద్వారా ఆ అమౌంట్ మొత్తాన్ని హోల్డ్ చేశారు. అలా రాజేందర్ కు సంబంధించిన రూ. 5.80 లక్షలు అతని అకౌంట్లో రిఫండ్ అయ్యింది.