అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | కల్లు దుకాణాల నిర్వహణకు భారీగా పోటీ నెలకొంది. వేలంపాటలో రూ.లక్షలు పాడి మారి కొందరు డిపోలను దక్కించుకుంటున్నారు. ప్రతి ఏటా దసరాకు గ్రామాల్లో కల్లు డిపో(Kallu Depot)ల టెండర్లు నిర్వహిస్తారు.
అప్పుడు వేలంలో దుకాణాన్ని దక్కించుకున్న వారు ఏడాది పాటు కల్లు అమ్ముకోవచ్చు. ప్రస్తుతం దసరా సమీపిస్తుండటంతో పల్లెల్లో కల్లు దుకాణాల టెండర్ల జోరు కనిపిస్తోంది. ఏ నలుగురు కలిసిన టెండర్ల గురించే చర్చించుకుంటున్నారు. గతంలో గ్రామాల్లో కల్లు దుకాణం(Kallu Shop) కొనసాగించాలంటే పెద్దగా కష్టం ఉండేది కాదు. చెట్టునుంచి కల్లు తెచ్చి డిపోలో నీళ్లు కలిపి విక్రయించేవారు. అయితే గ్రామాభివృద్ధి కమిటీలకు కొంతమొత్తం చెల్లించేవారు. ప్రస్తుతం కల్లు దుకాణాలు నిర్వహించడానికి పోటీ ఎక్కువైంది.
దాంతో గతంలో మాదిరిగా ఇంటికొకరు చొప్పున కాకుండా ఇప్పుడు ఎవరో ఒకరికి మాత్రమే ఇస్తున్నారు. పోటీ పెరగడంతో వేలం విధానాన్ని తీసుకొచ్చారు. వేలంలో ఎక్కువ పాడి దక్కించుకున్న వారికే కల్లు అమ్ముకునే అవకాశం ఉంటుంది. వేలంలో వచ్చిన ఆదాయాన్ని సంబంధిత కుల సంఘం, అసోసియేషన్లో ఉన్నవాళ్లు సమానంగా పంచుకుంటున్నారు. కొన్ని చోట్ల రూ.లక్షల్లో వేలం పాడుతుండగా.. పలు దుకాణాలకు రూ.కోట్లు పలుకుతున్నట్లు సమాచారం. గత సంవత్సరం ఓ డిపోను రూ.7 కోట్లకు వేలంలో దక్కించుకున్నట్లు ప్రచారం సాగింది. ప్రస్తుతం చాలా గ్రామాల్లో టెండర్ల ప్రక్రియ ముగిసినట్టుగా తెలుస్తోంది.
Kamareddy | కృత్రిమ కల్లు తయారీ
గ్రామాలు, పట్టణాల్లో రోజంత కష్టపడి వచ్చిన వారు సాయంత్రం కల్లు తాగి పడుకుంటారు. అయితే తాటి, ఈత చెట్లు లేకపోవడంతో కల్లు డిపోల నిర్వాహకులు యథేచ్ఛగా కల్తీ కల్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. అల్ప్రాజోలం(Alprazolam), డోజోఫాం(Dozoform)తో కల్లు తయారు చేసి అమ్ముతున్నారు. దీనిని తాగిన ప్రజలు బానిసలుగా మారుతున్నారు. కల్లు లేకపోతే పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నారు. రూ.లక్షలు పెట్టి వేలంలో దుకాణాలు దక్కించుకున్న వారు ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా తమకు లాభాలు రావాలనే ఉద్దేశంతో కల్తీ కల్లు విక్రయిస్తున్నారు. అయినా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టడం లేదు.
Kamareddy | మందు కల్లు రూ.10.. చెట్టు కల్లు రూ.150
గతంలో గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ ఈత చెట్లు కనిపించేవి. ప్రస్తుతం ఈత, తాటి చెట్లు లేకపోవడంతో కల్లు దొరకడం లేదు. దీంతో కల్లు దుకాణాల్లో కల్తీ కల్లు(Kalthi Kallu) విక్రయిస్తున్నారు. రూ.10 నుంచి రూ.20కి సీసా చొప్పున కృత్రిమ కల్లు అమ్ముతున్నారు. అయితే పలు గ్రామాల్లో ఈత వనాలు ఉన్నాయి. అక్కడ మాత్రం చెట్ల కల్లు దొరుకుతోంది. ఈ కల్లుకు మాత్రం రూ..100 నుంచి రూ.150 వరకు వసూలు చేస్తున్నారు.
Kamareddy | పట్టించుకోని అధికారులు
గ్రామాల్లో కల్లు దుకాణాల వేలం, కల్తీ కల్లుపై అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. వేలం ప్రక్రియ కుల సంఘం జీవనోపాధికి సంబంధించిన అంశంగా చెబుతున్నారు. అయితే పెద్ద మొత్తంలో టెండర్ పాడిన వారు నష్టపోతున్నారు. మళ్లీ దసరా వచ్చే లోపు టెండర్లో చెల్లించిన మొత్తంతో పాటు డిపో నిర్వహణ, కూలీలు, మత్తు పదార్థాలకు వెచ్చించిన మొత్తంతో పెద్దమొత్తంలో అప్పుగా మారుతొంది. అనేక మంది మూస్తేదారులు టెండర్ తీసుకుని అప్పులు చెలకించలేక ఆస్తులు అమ్ముకున్న ఘటనలు ఉన్నాయి. వీటిపై గౌడ కులపెద్దలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు తమకేమీ వ్యవహరిస్తున్నారు.
Kamareddy | టెండర్లపై అవగాహన కల్పిస్తున్నాం
– హన్మంత్ రావు ఎక్సైజ్ సూపరింటెండెంట్, కామారెడ్డి
కల్లు దుకాణాల టెండర్ల వేలంపై అవగాహన కల్పిస్తున్నాం. అది వారి ఉపాధికి సంబంధించింది అంటున్నారు. జిల్లాలో కల్తీ కల్లు ఘటనలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. జిల్లాలో 413 కల్లు దుకాణాలకు లైసెన్సులు ఉన్నాయి. ఇప్పటి వరకు అక్రమంగా కల్లు విక్రయించిన వారిపై 192 కేసులు నమోదు చేసి 94 మందిని అరెస్ట్ చేశాం. 18 టీఎఫ్టీ లైసెన్సులు రద్దు చేశాం. ఒక సొసైటీ కూడా రద్దు చేశాం.