Uttarpradesh
UttarPradesh | వైద్యరంగంలోనే అరుదైన ఘ‌ట‌న‌.. మహిళ గర్భంలో కాకుండా కాలేయంలో పెరుగుతున్న పిండం!

అక్షరటుడేర, వెబ్​డెస్క్: UttarPradesh | వైద్యరంగంలోనే ఇప్పటి వరకు జరగని అరుదైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూడ‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌చ‌కితుల‌వుతున్నారు. ఉత్తరప్రదేశ్‌ (UttarPradesh)లోని మీరట్‌లో ఒక మహిళ అత్యంత అరుదైన గర్భధారణ కేసు వెలుగులోకి వచ్చింది.

గర్భాశయంలో కాకుండా కాలేయం(లివర్)లో పిండం అభివృద్ధి చెందుతున్న విషయం వైద్యులను షాక్‌కు గురి చేసింది. బులంద్‌షహర్‌(Bulandshahar)కు చెందిన మహిళ గత రెండు నెలలుగా తీవ్ర కడుపునొప్పి, వాంతులు వంటి సమస్యలతో బాధపడుతూ మీరట్‌(Meerat)లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌ను సంప్రదించారు. అక్కడ డాక్టర్లు ఎంఆర్ఐ స్కాన్ చేయగా, పిండం గర్భాశయంలో కాకుండా లివర్‌(Liver)లో అభివృద్ధి చెందుతుంద‌న్న విష‌యం బ‌య‌టప‌డింది.

UttarPradesh | అలా ఎలా జ‌రిగింది..

ఇది చూసి వైద్యులు ఆశ్చర్యానికి లోన‌య్యారు. పిండం గుండె కొట్టుకుంటోంది, అంటే అది జీవంగా ఉందని డాక్టర్ కె.కె.గుప్తా నిర్ధారించారు. ఈ పరిస్థితిని వైద్య భాషలో “ఇంట్రాహెపాటిక్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ”(Intrahepatic Ectopic Pregnancy) అని అంటారు. ఇది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనే అత్యవసర గర్భధారణ సమస్యలో అత్యంత అరుదైన రూపం. సాధారణంగా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది గర్భం గర్భాశయానికి బదులు ఫెలోపియన్ ట్యూబ్‌(Fallopian Tube)లో అభివృద్ధి చెందే పరిస్థితి. ఇది 97 శాతం కేసుల్లో అక్కడే జరుగుతుంది. కానీ అరుదుగా ఇది లివర్, ప్లీహం, ఓవరీ (అండాశ‌యంలో) వంటి అవయవాల్లోనూ సంభవించవచ్చు. డాక్టర్లు చెబుతున్న వివరాల ప్రకారం.. 1954 నుంచి 1999 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా కేవలం 14 లివర్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కేసులు నమోదయ్యాయని రికార్డులు చెబుతున్నాయి. అంటే ఈ ఘటన అత్యంత అరుదైనదే కాదు, వైద్య చరిత్రలో చోటుచేసుకున్న భిన్నమైన సంఘటనలలో ఒకటిగానూ నిలిచింది.

ప్రస్తుతం ఆ మహిళను గైనకాలజీ నిపుణుల(Gynecology Experts) పర్యవేక్షణలో ఉంచారు. ఆమెకు అవసరమైన చికిత్స అందిస్తున్నారు. ఈ కేసు ప్రస్తుతం వైద్య, శాస్త్రీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పాఠశాల స్థాయిలో పాఠ్యాంశంగా కూడా చేరే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. గ‌తంలో కూడా వైద్యశాస్త్రానికి అంతు చిక్క‌ని సంఘ‌ట‌న‌లు ఎన్నో జ‌ర‌గ‌డం మ‌నం చూశాం.