Homeబిజినెస్​Stock Market | వచ్చే వారంలో మార్కెట్ల పయనమెటు?

Stock Market | వచ్చే వారంలో మార్కెట్ల పయనమెటు?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Stock Market | జూన్‌ 13తో ముగిసిన వారంలో నిఫ్టీ -50 ఇండెక్స్‌ 1.14 శాతం క్షీణించగా, సెన్సెక్స్‌ 1.30 శాతం పడిపోయింది. రాబోయే వారంలో మార్కెట్ల గమనం ఇజ్రాయిల్‌, ఇరాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, యూఎస్‌ ట్రేడ్‌ డీల్స్‌, వడ్డీ రేట్ల తగ్గింపుపై యూఎస్‌ ఫెడ్‌ తీసుకునే నిర్ణయాలు వంటి అనేక కీలక అంశాలపై ఆధారపడి ఉండనుంది.

ఇజ్రాయెల్‌(Israel), ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరగడం, యూఎస్‌ టారిఫ్‌ విధానం(US tariff policy) చుట్టూ నిరంతర అనిశ్చితి, ఎఫ్‌ఐఐల అమ్మకాలు గత వారం గ్లోబల్‌ మార్కెట్లపై ప్రభావాన్ని చూపాయి. భారత స్టాక్‌ మార్కెట్లు(Indian stock markets) సైతం దీనికి అనుగుణంగానే స్పందించాయి. శుక్రవారం నిఫ్టీ 50(NIfty 50) సూచీ 0.68 శాతం తగ్గి 24,718 వద్ద ముగిసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ నిఫ్టీని కిందికి లాగాయి.

Stock Market | తీవ్ర ఒడిదుడుకులు..

‘‘గత వారం ఈక్విటీ మార్కెట్లు(Equity markets) తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. యూఎస్‌, చైనా(china) మధ్య వాణిజ్య చర్చలలో పురోగతితో మార్కెట్‌ సెంటిమెంట్‌ బలపడినా దానిని ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ దాడి దెబ్బతీసింది. దీంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడులపై దృష్టి సారించడంతో మళ్లీ బంగారం, యూఎస్‌(US) బాండ్‌లు ర్యాలీ తీశాయి. మరోవైపు జూన్‌ 13తో ముగిసిన వారంలో నిఫ్టీ 50 ఇండెక్స్‌ 1.14 శాతం క్షీణించగా, సెన్సెక్స్‌(Sensex) 1.30 శాతం పడిపోయింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.90 శాతం, స్మాల్‌క్యాప్‌ 0.13 శాతం పడిపోయాయి.

Stock Market | వచ్చేవారం ప్రభావితం చేసే అంశాలు

  1. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ వార్‌..
    ఇటీవలి కాలంలో మధ్యప్రాచ్యం(Middle East)లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ వివాదం మరింత ముదురుతోంది. ఇజ్రాయిల్‌కు మద్దతుగా యూఎస్‌తోపాటు యూకే(UK) నిలుస్తున్నాయి. జెట్‌లతో సహా సైనిక సామగ్రిని తరలిస్తున్నట్లు బ్రిటన్‌ ప్రధాని ప్రకటించారు. ఈ నేపథ్యంలో జియో పొలిటికల్‌ టెన్షన్స్‌ ఇప్పట్లో తగ్గే సూచనలూ కనిపించడం లేదు. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ల మధ్య నెలకొన్న వివాదంతో మార్కెట్లు ఒత్తిడికి గురయ్యే అవకాశాలున్నాయి.
  2. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు..
    ఇజ్రాయిల్‌, ఇరాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. శుక్రవారం బ్రెంట్‌ ముడి చమురు ధర 7 శాతం పెరిగింది. ఇది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. వారం వ్యవధిలోనే బ్రెంట్‌(Brent) చమురు ధరలు 12.5 శాతం పెరగడం గమనార్హం. ప్రపంచంలోనే అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారులలో మనదేశం ఒకటి. ముడి చమురు ధరలు పెరిగితే మన ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ప్రభావం పడుతుంది. వాణిజ్య లోటు పెరుగుతుంది. దీంతో రూపాయి విలువ మరింత బలహీనపడే అవకాశాలుంటాయి. ఇదే జరిగితే ఇన్ఫ్లేషన్‌ పెరిగి, ఆర్థిక మందగమనం ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
  3. యూఎస్‌ ఫెడ్‌ మీటింగ్‌..
    యూఎస్‌ ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ(FOMC) సమావేశం మంగళవారం ప్రారంభం కానుంది. బుధవారం మీటింగ్‌ సారాంశం వెలువడనుంది. యూఎస్‌ టారిఫ్‌ విధానం ప్రభావంతో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో వడ్డీ రేట్ల(Rate cut)ను మార్చకపోవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించే అవకాశాలున్నాయి.
  4. ఎఫ్‌ఐఐల అమ్మకాలు..
    విదేశీ సంస్థాగత మదుపరులు(FII) తిరిగి నికర అమ్మకందారులుగా మారుతున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకు నికరంగా రూ. 4,812 కోట్ల విలువైన స్టాక్‌లను విక్రయించారు.
  5. ఇతర అంశాలు..
    రుతుపవనాలు ముందుగానే వచ్చి మురిపించినా ఆ తర్వాత వెనక్కి తగ్గాయి. భారీ వర్షాలు కురియకపోతే పంటల సాగుపై ప్రభావం పడుతుంది. దీంతో ఆర్థిక పరిస్థితిలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలుంటాయి.
    ఆదివారం ప్రారంభమైన జీ -7 శిఖరాగ్ర సమావేశం, ఈనెల 17న వెలువడే బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ విధాన నిర్ణయం, వివిధ దేశాలతో యూఎస్‌ వాణిజ్య ఒప్పందాలలో పురోగతి వంటి అంశాలపైనా మార్కెట్ల గమనం ఆధారపడనుంది. అయితే మన కంపెనీల క్యూ4 రిజల్ట్స్‌ బాగున్నందున పతనం సైతం ఇన్వెస్టర్లకు మంచి అవకాశమేనన్న అభిప్రాయాన్ని అనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు. ఫండమెంటల్‌గా బలంగా ఉన్న స్టాక్స్‌ను ఎంపిక చేసుకుని మద్దతు స్థాయిల వద్ద ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాలని సూచిస్తున్నారు.