అక్షరటుడే, హైదరాబాద్: World Lung Day | ప్రస్తుతం మనం పీల్చే గాలి కూడా కలుషితమై విషంగా మారుతోంది. పెరిగిపోతున్న వాయు కాలుష్యం ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ లంగ్ క్యాన్సర్ (Lung cancer), సీవోపీడీ (COPD), ఆస్తమా (Asthma) లాంటి కేసులు ఏటా పెరుగుతున్నాయి. ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌కి వచ్చే లంగ్ క్యాన్సర్ రోగుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. 2021లో 649గా ఉన్న బాధితుల సంఖ్య 2024 నాటికి 749కి చేరుకుంది. ఇది దాదాపుగా 15.4% పెరుగుదలకు సమానం.
World Lung Day | ధూమపానం చేయని వారికి కూడా..
ప్రతి సంవత్సరం లంగ్ క్యాన్సర్ వచ్చే వారిలో 30 శాతం మందికి ధూమపానం అలవాటు లేకపోయినా, వాయు కాలుష్యం కారణంగా క్యాన్సర్‌కు గురవుతున్నారు. ప్రధానంగా వాయు కాలుష్యం, ధూమపానం ఊపిరితిత్తులలోని కణజాలాన్ని ప్రభావితం చేస్తాయి. వీటివల్ల న్యుమోనియా, క్షయ, లంగ్ క్యాన్సర్, పల్మనరీ ఎడిమా (ఊపిరితిత్తుల్లో నీరు చేరడం), పల్మనరీ ఎంబాలిజం వంటి రకరకాల వ్యాధులు దాడిచేస్తాయి. నగరంలోని వివిధ ఆస్పత్రులకు ఈ సమస్యలతో వచ్చే రోగుల సంఖ్య ఏటా పెరుగుతూ ఉంది.
World Lung Day | నివారణ చర్యలు:
- ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
- ధూమపానం మానేయడం: ధూమపానం ఊపిరితిత్తుల వ్యాధులకు అతి ముఖ్యమైన కారణం. వెంటనే ధూమపానం పూర్తిగా మానేయాలి.
- వాయు కాలుష్యం నుంచి రక్షణ: బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉపయోగించడం కూడా మంచిదే.
- క్రమం తప్పని వ్యాయామం: ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుకోవడానికి శ్వాస వ్యాయామాలు, తేలికపాటి వ్యాయామాలు ప్రతిరోజూ చేయాలి.
- పౌష్టికాహారం: విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తినాలి.
- ముందస్తు పరీక్షలు: ముఖ్యంగా వాయు కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించే వారు, కుటుంబంలో ఎవరికైనా ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నా, రెగ్యులర్ చెకప్‌లు చేయించుకోవడం మంచిది.