అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | రాష్ట్రవ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ (New Year Celebrations) అంబరాన్ని అంటాయి.
నగరంలో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా పోలీసులు ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్ (Drunk Drive) తనిఖీలు చేపట్టారు. మద్యం తాగి వాహనాలు నడుపొద్దని వారం రోజుల నుంచి పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. అయినా మందుబాబులు మారలేదు. హైదరాబాద్ కమిషనరేట్ (Hyderabad Commissionerate) పరిధిలో బుధవారం అర్ధరాత్రి 1198 మంది డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో దొరికారు. వారందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు తనిఖీలు చేపట్టారు.
Hyderabad | నడిరోడ్డుపై హంగామా
నగరంలోని వనస్థలిపురంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల సమయంలో ఒక వ్యక్తి నడిరోడ్డుపై పడుకుని హంగామా చేశాడు. పోలీసులు తనపై చేయి చేసుకున్నారని, తాను మద్యం తాగలేదని హల్చల్ చేశాడు. అయితే ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) ఈ ఆరోపణలను ఖండించి, సివిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకునేలోపే సదరు వ్యక్తి పారిపోయాడు. పోలీసులను చూసి ఓ వ్యక్తి బండిని, తన సోదరుడి పిల్లలను వదిలేసి పారిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో చోటు చేసుకుంది. డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండటంతో భయంతో బండిని, తన అన్న పిల్లలకు వదిలేసి పారిపోయాడు. పలుచోట్ల మందుబాబులు పోలీసులతో వాగ్వాదం చేశారు. హన్మకొండలో రికార్డు స్థాయిలో 432 పాయింట్ల ఆల్కహాల్ రీడింగ్ నమోదు కావడం గమనార్హం.
Hyderabad | డీజే ప్లేయర్‌కు డ్రగ్ పాజిటివ్
కూకట్పల్లి మాల్ (Kukatpally Mall)లోని డీజే ప్లేయర్‌కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. అర్ధరాత్రి పోలీసులు టెస్టులు నిర్వహించారు. డీజే ప్లేయర్ డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.