అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Local Trains | దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai) నగరంలో రద్దీ మాములుగా ఉండదు. ఎంతో మంది పొట్ట చేతపట్టుకొని ముంబైలో వాలిపోతారు. దీంతో అక్కడ ప్రజలు ప్రయాణం కోసం ఎక్కువగా లోకల్ రైళ్ల (Local Trains)ను వినియోగిస్తారు. అయితే ప్రజల రద్దీకి అనుగుణంగా ట్రైన్లు లేకపోవడంతో ఒక్కో రైళ్లో మోతాదుకు మించి ప్రయాణిస్తుంటారు.
బస్సుల్లో ఫుట్‌బోర్డు వద్ద వేలాడినట్లు ముంబై లోకల్ రైళ్లలో సైతం డోర్ల వద్ద వేలాడుతూ ప్రయాణం చేస్తారు. ఇది నిత్యం జరుగుతూనే ఉంటుంది. అయితే ఇలా వేలాడుతూ ప్రయాణించే సమయంలో జారి పడి ఎంతో మంది మృతి చెందుతున్నారు. సోమవారం లోకల్ ట్రైన్ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్(Chhatrapati Shivaji Maharaj Terminal)కు వెళ్తుండగా ముంబ్రా- దివా రైల్వే స్టేషన్ల మధ్య 12 మంది రైలులో నుంచి పడిపోయారు. ఇందులో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.
Local Trains | 11 ఏళ్లలో 6,760 మంది మృతి
ముంబై సబర్బన్ రైలు నెట్వర్క్ (Mumbai Suburban Rail Network)లో గత 11 ఏళ్లలో 29,970 మంది మరణించారు, 30,214 మంది గాయపడ్డారు. ఇందులో రైళ్ల నుంచి జారి పడి మృతి చెందిన వారు 6,760 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇలా ఏటా వందలాది మంది లోకల్ ట్రైన్ల నుంచి పడి చనిపోతున్నా అధికారులు చర్యలు చేపట్టడం లేదు. రైళ్లు బోగీలను పెంచడంతో పాటు, సర్వీసులను అదనంగా నడపాలని ముంబై వాసులు కోరుతున్నారు.