అక్షరటుడే, కామారెడ్డి : Local Body Elections | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై (local body elections) సస్పెన్స్ వీడటం లేదు. త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రులు చెబుతున్నా.. బీసీ రిజర్వేషన్ల అంశం కొలిక్కి రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది.
దీంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల (MPTC and ZPTC elections) కోసం ఓటర్ల జాబితాను (Voters list) అధికారులు ప్రదర్శించారు. దీంతో పలువురు ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రజలు తమ వైపు తిప్పుకోవడానికి డబ్బులు సైతం ఖర్చు చేస్తున్నారు. అయితే రిజర్వేషన్ ఖరారు కాకపోవడంతో వారు ఆలోచనలో పడ్డారు.
పల్లెల్లో ఎన్నికల వాతావరణం వచ్చినట్టే వచ్చి వెళ్లిపోతుంది. తాజాగా ఓటరు జాబితా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు, పోలింగ్ కేంద్రాల వివరాలు కూడా ప్రకటించడంతో మళ్లీ ఎన్నికలపై ఆశలు నెలకొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం పూర్తయి ఏడాదిన్నర దాటింది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మాజీలు అయి కూడా ఏడాది దాటిపోయింది. ప్రస్తుతం పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. అయితే సర్పంచులు (sarpanches) లేక పాలన అస్తవ్యస్తంగా మారింది. దీంతో స్థానిక ఎన్నికలు (Local Body Elections) ఎప్పుడు నిర్వహిస్తారా అని ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు.
Local Body Elections | గ్రామాల్లో సమస్యలు
గ్రామాల్లో ప్రజాప్రతినిధులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. పట్టించుకునే వారు లేక పాలన అస్తవ్యస్తంగా మారింది. ప్రజాప్రతినిధులు ఉంటే నేరుగా వారి వద్దకు వెళ్లి ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేవారు. ప్రత్యేక అధికారులను (special officers) నియమించినా వారు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో తెలియని పరిస్థితి. కార్యదర్శుల వద్దకు వెళ్తే నిధులు లేవని, ఇప్పటికే అప్పుల పాలు అయ్యామని చేతులు ఎత్తేస్తున్నారు.
Local Body Elections | అప్పుల ఊబిలో కార్యదర్శులు
గ్రామాలలో సర్పంచులు లేక పంచాయతీ కార్యదర్శులు (panchayat secretaries) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికలు నిర్వహిస్తే తప్ప గ్రామాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసే అవకాశాలు లేవు. మరోవైపు రోజువారీగా గ్రామాల్లో ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులపై పడింది. గ్రామాల్లో పన్నుల వసూళ్లు (tax collection) అంతంతమాత్రంగానే ఉండటంతో నిధులు లేక ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలను పరిష్కరించకపోతే గ్రామాలు కంపు కొట్టే పరిస్థితి. దీంతో పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేసి పనులు చేయిస్తున్నారు.
Local Body Elections | ఈ నెల 30లోపు సాధ్యమేనా..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దానికి తగినట్టుగా అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ఆమోదానికి పంపగా అది కాస్తా రాష్ట్రపతి చెంతకు చేరింది. రిజర్వేషన్ అమలు చేయాలంటే చట్టం కావాల్సి ఉంది. సెప్టెంబర్ 30లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు (High Court) ఆదేశించింది. బీసీ రిజర్వేషన్లపై ఇంకా ఎటు తేలకపోవడంతో ఎన్నికలు నిర్వహిస్తారా.. లేదా అనేది తెలియాల్సి ఉంది.
Local Body Elections | జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వివరాలు
జిల్లాలో 25 మండలాల్లో 532 గ్రామాలు ఉన్నాయి. 233 ఎంపీటీసీ స్థానాలు, 25 జెడ్పీటీసీ, 4,656 వార్డు స్థానాలు ఉన్నట్టుగా అధికారులు ప్రకటించారు. జిల్లాలో మొత్తం 6,39,730 మంది ఓటర్లు ఉండగా ఇందులో 3,07,508 మంది పురుషులు, 3,32,209 మంది మహిళలు, 13 మంది ఇతరులు ఉన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు 1,259 పోలింగ్ కేంద్రాల (polling stations), పంచాయతీ ఎన్నికలకు 4,672 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తే ఎన్నికలు నిర్వహించడమే మిగిలి ఉంది.