New Pope Appointed | కొత్త పోప్​ నియామకం ఎలా..? ఎవరు నియమిస్తారో తెలుసా..?
New Pope Appointed | కొత్త పోప్​ నియామకం ఎలా..? ఎవరు నియమిస్తారో తెలుసా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: New Pope Appointed : పోప్ ఫ్రాన్సిస్‌ మరణంతో వాటికన్ సిటీ(Vatican City ) లో కొత్త పోప్ ఎన్నిక అనివార్యమైంది. కాథలిక్ చర్చి(Catholic Church)లోని అత్యంత సీనియర్ అధికారులే కొత్త పోప్‌ను ఎన్నుకుంటారు. వారందరినీ కలిపి కాలేజ్ ఆఫ్ కార్డినల్స్ గా పిలుస్తారు. ఈ కార్డినల్స్ లో ఉండేది అందరూ పురుషులే. వీరిని నేరుగా పోప్ నియమిస్తారు.

ప్రస్తుతం కాథలిక్ చర్చిలో 252 మంది కాథలిక్ కార్డినల్స్ ఉన్నారు. వీరిలో 138 మంది కొత్త పోప్‌‌ను ఎన్నుకునేందుకు అర్హులు. మిగతా 114 మంది 80 ఏళ్లు దాటినవారు కావడం వల్ల, వారు ఓటింగ్‌లో పాల్గొనరు. అయితే, పోప్‌గా ఎవరిని నియమించాలన్న చర్చలో మాత్రం పాల్గొంటారు.

పోప్ మరణించినప్పుడు (2013లో పోప్ బెనెడిక్ట్ -16లా రాజీనామా చేయడం వంటి సందర్భంలో) వాటికన్‌లో కార్డినల్స్‌ను సమావేశానికి పిలుస్తారు. అనంతరం కాంక్లేవ్ జరుగుతుంది. పోప్ మృతి, వారసుడి ఎన్నిక మధ్య కాలంలో కాథలిక్ చర్చి నిర్వహణ బాధ్యతను కార్డినల్స్ చూసుకుంటారు.

సిస్టీన్ చాపెల్(Sistine Chapel) లోపల ఈ ఎన్నిక చాలా రహస్యంగా ఉంటుంది. మైఖేలాంజెలో(Michelangelo) చిత్రంలో ఈ సిస్టీన్ చాపెల్‌ ని మనం చూడొచ్చు. విజేతను నిర్ణయించేంతవరకు తమకు నచ్చిన అభ్యర్థికి కార్డినల్స్ ఓటు వేస్తారు. ఈ ప్రక్రియ చాలా రోజులు కొనసాగవచ్చు.

గతంలో ఓటింగ్ వారాలు, నెలల తరబడి కొనసాగేది. కాంక్లేవ్‌ల సమయంలో కొంతమంది కార్డినల్స్ మరణించారు కూడా. కార్డినల్స్ బ్యాలెట్ పేపర్లను కాల్చడం ద్వారా ఎన్నికల అప్​డేట్​ తెలుపుతారు. నలుపు రంగు పొగ వస్తే పోప్ ఎన్నిక ఇంకా పూర్తికాలేదని అర్థం. తెల్లటి పొగ వెలువడితే కొత్త పోప్ ఎన్నిక పూర్తయినట్లు అర్థం.