అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Womens World Cup | ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ 2025 (Womens World Cup)లో భారత మహిళా క్రికెట్ జట్టు మైదానంలో అద్భుత ప్రదర్శనతో అభిమానులను మైమరపించింది. దాదాపు నెల రోజుల పాటు ఈ టోర్నీ సాగింది. ఈ టోర్నీలో భారత మహిళలు అద్భుత ప్రదర్శన కనబరిచి ట్రోఫీ దక్కించుకున్నారు.
అయితే ఆ విజయాల వెనుక ఉన్న అసలు కథ చాలా మందికి తెలియదు, అది పీరియడ్స్ యుద్ధం. నెలసరి సమయంలో తీవ్రమైన నొప్పి, అలసట, మూడ్ స్వింగ్స్ (Mood Swings) మధ్య కూడా మైదానంలో చిరునవ్వుతో నిలబడి, దేశానికి గౌరవం తీసుకురావడం ఈ మహిళా క్రికెటర్ల అసలైన శక్తి. వైద్యపరంగా చూస్తే, పీరియడ్స్ సమయం (Periods Time)లో శరీరంలో హార్మోన్ల మార్పులు జరిగి బలహీనత, నీరసం, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు వస్తాయి.
Womens World Cup | ఆషా మాషీ కాదు..
అయినా కూడా ఆటగాళ్లు గంటలపాటు పరుగులు తీసి, ఫీల్డ్‌లో ఫిట్‌గా ఉండటం చిన్న విషయం కాదు. ఈ క్లిష్ట సమయంలో జట్టుకు ప్రత్యేక వైద్య, మానసిక ప్రణాళికలు సిద్ధంగా ఉంటాయి. మ్యాచ్ ముందు క్రీడాకారిణులు తేలికపాటి పెయిన్ కిల్లర్లు లేదా హాట్ ప్యాడ్లు ఉపయోగించి నొప్పిని నియంత్రిస్తారు. ఫిజియోలు, డాక్టర్లు ప్రతి ఆటగాడి పరిస్థితిని గమనించి అవసరమైన సలహాలు ఇస్తారు. కానీ మందులతో పాటు మానసిక దృఢత్వం కూడా కీలకం. చాలా మంది క్రీడాకారిణులు నొప్పిని పక్కన పెట్టి ఆటపై దృష్టి కేంద్రీకరిస్తారు. పెద్ద టోర్నమెంట్ల సమయంలో కొందరు వైద్యుల సూచనతో హార్మోనల్ టాబ్లెట్లు తీసుకుని పీరియడ్స్‌ను వాయిదా వేస్తారు. ఇవన్నీ పూర్తిగా వైద్య పర్యవేక్షణలోనే జరుగుతాయి.
ఇక సాంకేతికత కూడా ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తోంది. జట్లు పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ ద్వారా ప్రతి క్రీడాకారిణి చక్రాన్ని పర్యవేక్షిస్తూ, ఆ దశకు అనుగుణంగా శిక్షణ, ఫిట్‌నెస్, పోషణ ప్లాన్‌లు రూపొందిస్తాయి.ఈ సమయంలో ఆటగాళ్ల డైట్‌కి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఐరన్, కాల్షియం, ప్రోటీన్, హైడ్రేషన్ పైన దృష్టి పెడుతూ పీరియడ్-ఫ్రెండ్లీ మీల్ ప్లాన్‌ను అందిస్తారు. ఒకవేళ ఎవరైనా తీవ్రమైన నొప్పి లేదా హార్మోనల్ ఇష్యూలను ఎదుర్కొంటే వెంటనే స్పోర్ట్స్ గైనకాలజిస్టు (Sports Gynecologist)ను సంప్రదిస్తారు. మైదానంలో వారు చూపే ఆత్మస్థైర్యం, క్రమశిక్షణ, త్యాగం వెనుక ఈ నిశ్శబ్ద పోరాటం ఉంది. ప్రతి షాట్ వెనుక, ప్రతి వికెట్ వెనుక, ప్రతి విజయ గర్జన వెనుక ఒక అజేయమైన మహిళా హృదయం దాగి ఉంది.
