అక్షరటుడే, వెబ్‌డెస్క్: Raja Raghuvanshi | హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లి అక్కడ హత్యకు గురైన ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ కేసులో రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య కేసు దర్యాప్తు చేస్తున్నా కొద్ది ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగుచూస్తున్నాయి. రాజా రఘువంశీని పెళ్లి చేసుకున్న తర్వాతనే తన ప్రియుడు రాజ్ కుశ్వాహ (Raj Kushwaha)తో కలిసి సోనమ్(Sonam) భర్త హత్యకు కుట్రపన్నిందని భావిస్తుండగా.. పెళ్లికి మూడు నెలల ముందే హత్యకు కుట్ర జరిగిందని తాజాగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
Raja Raghuvanshi | కీలక విషయాలు..
రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీల వివాహం మే 11న జరిగింది. అయితే పెళ్లికి కొన్ని నెలల ముందే వారి వివాహం నిశ్చయమైంది. అయితే పెళ్లికి మూడు నెలల ముందే తన ప్రియుడు రాజ్‌కుశ్వాహతో కలిసి సోనమ్.. కాబోయే భర్త రాజా రఘువంశీ హత్యకు కుట్రపన్నినట్లు విచారణలో తేలింది. ప్రియుడితో పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో రాజా రఘువంశీని పెళ్లిచేసుకుని హత్యచేస్తే.. విధవరాలైన తనను ప్రియుడికి ఇచ్చి రెండో పెళ్లి చేస్తారని సోనమ్ (Sonam) భావించింది. కానీ అంతా తారుమారైంది. మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. మేఘాలయ(Meghalaya)లో సోనమ్, రాజా కలిసి రికార్డు చేసుకున్న చివరి వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఈ వీడియోలో భార్య సోనమ్ ధరించి కనిపించిన షర్ట్ రాజా మృతదేహం లభ్యమైన ప్రదేశంలో కనుగొన్నారు. హత్య జరగడానికి ముందు వారీ వీడియోను తీసుకున్నట్టు తెలిసింది. ఈ పరిణామం కేసు దర్యాప్తులో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ప్రస్తుతం పోలీసులు ఈ వీడియో ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సోనమ్‌ను కూడా విచారించి మరిన్ని వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ చివరి వీడియో, ఘటనా స్థలంలో లభించిన షర్ట్ ఆధారంగా రాజా మృతికి గల కారణాలను ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు.