అక్షరటుడే, వెబ్‌డెస్క్: Honda 0 α (alpha) SUV | ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దీనికి అనుగుణంగా అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారిస్తున్నాయి. హోండా కంపెనీ సైతం కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (Electric SUV) కాన్సెప్ట్ వాహనాన్ని తీసుకు వస్తున్నట్లు ప్రకటించింది.
ఈ ఏడాది జనవరిలో హోండా మోటార్ (Honda Motor) సంస్థ.. హోండా 0 సలూన్, హోండా 0 ఎస్‌యూవీ మోడళ్లను పరిచయం చేసింది. ఈ సిరీస్‌లో హోండా 0 α (ఆల్ఫా) ని కూడా చేర్చింది. ఇది భారతీయ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన ప్రాజెక్టు అని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. హోండా 0 α (ఆల్ఫా) కారు ఫీచర్స్ తెలుసుకుందామా..
డిజైన్ : హోండా 0 ఆల్ఫా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డిజైన్ పెద్ద హోండా 0 ఎస్‌యూవీ స్టైలింగ్‌ను కొనసాగిస్తున్నా.. కాస్త చిన్నగా ఉంటుంది. ముందు భాగంలో ఇల్యూమినేటెడ్ హోండా లోగో ఉంది. 19 అంగుళాల షార్ప్ డిజైన్ అల్లాయ్ వీల్స్, హై గ్రౌండ్ క్లియరెన్స్, యారో స్టైల్ బాడీ క్లాడింగ్ ఎస్‌యూవీ లుక్‌ను మరింత అగ్రెసివ్‌గా చూపిస్తుంది.
రియర్ భాగంలో ఫుల్ విడ్త్ యూ షేప్ టెయిల్ ల్యాంప్స్, ఫోక్స్ బాష్ ప్లేట్ అండ్ ఎంపీవీ తరహాలో కనిపించే సీ పిల్లర్ ఈ ఎస్‌యూవీకి బోల్డ్ అప్పీల్ ఇస్తాయి. ఈ కాన్సెప్ట్ వాహనాన్ని థిన్, లైట్ అండ్ వైస్ (Thin, Light and Wise) డిజైన్ ఫిలాసఫీతో రూపొందించినట్లు హోండా చెబుతోంది.
 వీల్‌బేస్ 2650 -2750 mm మధ్యలో ఉంటుందని భావిస్తున్నారు.
బ్యాటరీ ప్యాక్ : ఈ ఎస్‌యూవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తోంది. 65 కేడబ్ల్యూహెచ్‌తోపాటు 75 కేడబ్ల్యూహెచ్‌లను అందించనుంది. ఎల్‌ఎఫ్‌పీ టెక్నాలజీతో ఈ రెండు బ్యాటరీలు నడుస్తాయి. అంటే ఇది భారత్ (Bharat) లాంటి వేడి వాతావరణానికి అనుకూలంగా ఉంటుందన్న మాట. ప్రారంభంలో ఈ మోడల్ సింగిల్ మోటార్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ సెటప్‌లో లభించనుంది.
ధర : ఈ ఎస్‌యూవీ కారు ధర(ఎక్స్ షోరూం) రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. మైలేజ్ విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది. భారత ఈవీ మోటార్ మార్కెట్‌లో హోండా 0 α (ఆల్ఫా) ఒక గేమ్ చేంజర్‌గా నిలుస్తుందని కంపెనీ ఆశిస్తోంది. ఇది మారుతి ఇ విటారా, మహీంద్రా బీఈ6, టాటా కర్వ్(Tata Curvv), హ్యుందాయ్ క్రెటా, ఎంజీ జడ్‌ఎస్ లాంటి ఈవీ వాహనాలకు పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.

